ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని, ఒక గ్రామానికి వెళ్లిన తర్వాత వైద్యుడు ఏం చేయాలన్నదానిపై నిర్దేశించుకున్న ఎస్‌ఓపీ కచ్చితంగా అమలు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఏప్రిల్ 6 నుంచి 28 వరకూ 20,25,903 మందికి సేవల అందించినట్లు అధికారులు సిఎంకు వివరించారు. క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి సమర్థులైన అధికారులు ఉండేలా చూసుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా కూడా సిబ్బంది లేరనే మాట రాకూడదని, వైద్య ఆరోగ్యశాఖ రిక్రూట్‌మెంట్ బోర్డు వెంటనే ఖాళీలను భర్తీచేసేలా చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు.
కోవిడ్ తాజా పరిస్థితులు, కంటివెలుగు, రక్తహీనత, పౌష్టికాహార లేమి తదితర అంశాలపై కూడా సిఎం ఆరా తీశారు. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలలో నాడు – నేడు పనులపై సీఎం అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల కారణంగా 2100 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయని, ప్రస్తుతం ఉన్న 2185 మెడికల్ సీట్లకు ఇవి అదనం అని అధికారులు తెలిపారు. ఈ విద్యాసంవత్సంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో తరగతులు ప్రారంభిస్తున్నామని, వీటి ద్వారా 750 సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. 2024 –25 విద్యా సంవత్సరంలో మరో 350 ఎంబీబీఎస్ సీట్లు …. 2025–26 విద్యాసంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, మదనపల్లె, పెనుకొండ, పాలకొల్లు, మార్కాపురం, నర్సీపట్నం, అమలాపురం, పార్వతీపురం మెడికల్ కాలేజీల్లో తరగతులు నిర్వహించేందుకు కార్యాచరణతో ముందుకెళ్తున్నామన్న అధికారులు. తద్వారా మరో 1000 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు సమావేశంలో వివరణ ఇచ్చారు. నిర్దేశించుకున్న కార్యాచరణతో పనులు ముందుకు సాగాలన్న సిఎం వారికి నిర్దేశించారు.