వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి అందరికీ విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి అభిలషించారు.
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వరకూ 21 రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. నేటి ఉదయం 5 గంటల నుంచే భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
కాసేపట్లో ప్రభుత్వం తరఫున స్వామి వారికి జిల్లాకు చెందిన రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల సౌకర్యార్ధం అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు వెల్లడించారు.