Sunday, January 19, 2025
HomeTrending NewsIftar: ఘనంగా ఇఫ్తార్ విందు

Iftar: ఘనంగా ఇఫ్తార్ విందు

దేవుని సన్నిధిని చేరుకోవడానికి ఆలస్యం కావచ్చు కానీ చేరుకోవడం తథ్యం (అల్లా కే ఘర్ మే దేర్ హే లేకిన్ అంధేర్ నహీ హే) అని, తెలంగాణ కోసం పోరాడినట్లుగానే ఉజ్వల భారతదేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి లక్ష్యం చేరుకోవడం తథ్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు ఎల్బీ స్టేడియం కు వెళ్ళిన సీఎం కేసీఆర్ తొలుత అనీస్ ఉల్ గుర్బా లో ఆశ్రయం పొందుతున్న అనాధ పిల్లలతో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు, వారి చదువు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో ఇంగ్లీషు భాషలో సంభాషిస్తుంటే ఆనందిస్తూ వారితో ముచ్చటించారు. అనంతరం ముస్లిం మత పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. సభా వేదికను అలంకరించిన సీఎం కు మైనార్టీస్ వెల్ఫేర్ కమిషనర్ షఫీ ఉల్లా, మైనార్టీస్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎ.కె.ఖాన్ ముఖ్యమంత్రి కేసీఆర్ కి జ్ఞాపికతో పాటు భారతదేశ పటంలో సీఎం కేసీఆర్ ని చిత్రించిన ఫోటోను బహుకరించారు. భారీ సంఖ్యలో వచ్చిన సభను ఉద్దేశించి హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అనంతరం మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రసంగించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనా చారి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, అంబర్ పేట కాలేరు వెంకటేష్, మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎ.కె.ఖాన్, సీఎస్ శాంతి కుమారి, డిజిపి అంజనీ కుమార్, మైనార్టీస్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, సీఎం సెక్రటరీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మైనార్టీస్ వెల్ఫేర్ కమిషనర్ షఫీ ఉల్లా, పలువురు కార్పోరేషన్ల చైర్మన్లు, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగం – ముఖ్యాంశాలు:
దేశంలోనే మరే రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3,17,115. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి పెద్ద పెద్ద రాష్ట్రాలకంటే మనం ముందంజలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తలసరి విద్యుత్ వినియోగం 1000 … 1050 యూనిట్లు ఉండేది. నేడది రెండింతలు పెరిగి 2100 యూనిట్లకు చేరుకున్నది. దేశంలోనే మనం అత్యున్నత స్థానంలో నిలిచాం. పరిశ్రమలు, ఐటి రంగంలో పురోగమిస్తున్న తీరును అందరూ గమనిస్తూనే ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసి తదితరులు కోరిన మేరకు అనీస్ ఉల్ గుర్బా ను అత్యద్భుతంగా నిర్మించుకున్నాం. బిఆర్ఎస్ కు పూర్వం ఈ ప్రాంతాన్ని 10 సంవత్సరాలపాటు కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఈ పదేళ్ళ కాలంలో వారు దాదాపు 1200 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేశారు. బిఆర్ఎస్ ఈ పదేళ్ల కాలంలో 12000 కోట్ల రూపాయలను ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేసింది. ఇవి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వెలువరించిన గణాంకాలు. అసెంబ్లీ, సెక్రటేరియట్ తో పాటు మైనార్టీ వెల్ఫేర్ సైట్ లో ఈ వివరాలను చూడవచ్చు.


గతంలో లాగా రైతుల ఆత్మహత్యలు ఇప్పుడు లేవు. జీవన పోరాటం లో భాగంగా బయటి రాష్ట్రాలకు వెళ్ళిన రైతులు నేడు వారి వారి ఊళ్లకు తిరిగి వచ్చారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో 94 లక్షల ఎకరాల్లో వరి పంటను పండించుకున్నామని నేను గర్వంతో చెప్తున్నాను. మొత్తం దేశంలో సాగుచేసిన 66 లక్షల 40 ఎకరాల వరి సాగు విస్తీర్ణం కంటే ఒక తెలంగాణలోనే పండించిన వరి సాగు విస్తీర్ణం చాలా ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం తీరుగా శ్రమిస్తే దేశ జిడిపి కనీసం మరో 3 లక్షల నుంచి 4 లక్షలు పెరిగేది. ఈ విషయంలో మనం దెబ్బతిన్నాం. ప్రస్తుతమున్న దేశ రాజకీయ పరిస్థితులను మార్చేందుకు నేను దేశ రాజకీయాల్లోకి ప్రవేశించాను. మహారాష్ట్ర ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. నా అంచనాలకు మించి ప్రజాదారణ లభిస్తున్నది. ఈ దేశం సరైన నాయకునికి కోసం, పార్టీ కోసం వేచి చూస్తున్నదనేది స్పష్టమైంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్