పాలనలో నైజాంను మించిన సీఎం కేసీఆర్..ఇష్టారాజ్యంగా ప్రభుత్వ శాఖల కుదింపు చేస్తున్నారని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. రెవెన్యూ శాఖ నిర్వీర్యం.. వీఆర్ వో వ్యవస్థ రద్దుతో క్షేత్రస్థాయిలో ప్రభుత్వం కనుమరుగయిందన్నారు. ఆంక్షలు లేకుండా పంచాయతీ కార్యదర్శులను నూరు శాతం క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిఎం కెసిఆర్ పాలనపై విమర్శలు సంధించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఆపద సమయాల్లో క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి, ఆదుకునే రెవెన్యూ వ్యవస్థను వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి, నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు.
క్షేత్రస్థాయిలో ప్రస్తుతం ఆర్ఐ లు మినహా ఎవరూ లేరని, ఇటీవల టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్లలో సైతం ఆర్ ఐ ల పోస్టుల భర్తీ లేదని, భవిష్యత్లో ఆర్ ఐ వ్యవస్థను సైతం రద్దు చేస్తారని జీవన్ రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో నూతన ఉద్యోగవకాశాలు మెరుగైతయ్ అని అనుకుంటే ఉన్న ఉద్యోగాలు కనుమరుగైపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్టు వ్యవస్థ, ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేస్తామన్నారు. ఉద్యోగులకు వేతనాలు తగ్గించుకునేందుకు శాఖలు కుదిస్తున్నారని ఆరోపించారు. ఇష్టారీతిన ప్రభుత్వ శాఖలను రద్దు చేస్తూ, కుదిస్తూ పాలనలో సీఎం కేసీఆర్ నైజాంను మించిపోయారని విమర్శించారు.
10వేల వీఆర్ ఓ పోస్టులు రద్దు చేశారు.. 23వేల వీఆర్ఎ పోస్టులను రద్దు చేయబోతున్నారని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖకు చెందిన 30వేల ఉద్యోగాలను రద్దు చేస్తున్నారని, వీఆర్ ఓ లను ఇతర శాఖలకు బదిలీ చేయడంతో రెవెన్యూ శాఖ కనుమరుగైందన్నారు. నీటిపారుదల శాఖలోని భారీ, మధ్యతరహా, చిన్ననీటి, ఎత్తిపోతల శాఖలుండేవని, ప్రభుత్వ శాఖలను కుదిస్తున్నరని మండిపడ్డారు.
బిల్లులు రావడం లేదని కొంతమంది సర్పంచులు వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, డంపింగ్ యార్డులు పనిచేయలేకపోయారు. దీనికి పంచాయతీ
కార్యదర్శులను బాధ్యులను చేయబోతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయించలేకపోయారు కాబట్టి గ్రేడింగ్
తగ్గించి ఇచ్చే కుట్ర పన్నుతున్నారన్నారు. ఎస్సీ,ఎస్టీ సర్పంచులు పెట్టుబడి పెట్టలేక పనులు చేయలేకపోతే కార్యదర్శుల మెడ మీద కత్తి పెట్టబోతున్నారని, నూతనంగా మెరిట్ ఆధారితంగా నియమించబడిన పంచాయతీ కార్యదర్శుల మెడపై కత్తి పెట్టడం సరికాదని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ, పరిశీలన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందని, రెవెన్యూ శాఖను కనుమరుగు చేయాలని చూడడం ఆత్మహత్యాసదృశ్యమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
వీఆర్ఎ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తూ, కొనసాగించాలని జీవన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వీఆర్ఓ వ్యవస్థను యథావిధిగా కొనసాగించేందుకు పునః పరిశీలించాలి. పంచాయతి కార్యదర్శులపై ఎటువంటి మదింపు లేకుండా నూరుశాతం క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.