Friday, October 18, 2024
HomeTrending News8 ఏండ్లల్ల బిజెపి ఏం చేసింది - కెసిఆర్

8 ఏండ్లల్ల బిజెపి ఏం చేసింది – కెసిఆర్

వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభించారు. క‌లెక్ట‌రేట్‌లో సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఎన్నేప‌ల్లిలో సమీ‌కృత కలె‌క్ట‌రే‌ట్‌కు 34 ఎక‌రాల భూమి కేటా‌యిం‌చగా రూ.60.70కోట్లు వెచ్చించి నిర్మాణం చేప‌ట్టారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మ‌హేశ్వ‌ర్ రెడ్డి, కాలే యాద‌య్య‌, పైల‌ట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు సుర‌భి వాణిదేవి, ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌రేట్ ప్రారంభం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ బిజెపి తీరుపై నిప్పులు చెరిగారు.

రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. వికారాబాద్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సీఎం కేసీఆర్‌కు బీజేపీ నాయ‌కులు అడ్డురావ‌డంపై ఆగ్ర‌హం వెలిబుచ్చారు. బీజేపీ జెండాలు ప‌ట్టుకుని నా బ‌స్సుకే అడ్డం వ‌స్తారా? అని మండిప‌డ్డారు.  తెలంగాణ ప్ర‌జ‌లు మోస‌పోతే గోస‌ప‌డే ప‌రిస్థితులు వ‌స్తాయి. వ‌చ్చిన తెలంగాణ‌ను మ‌ళ్లీ గుంట‌న‌క్క‌లు వ‌చ్చి పీక్కొని తిన‌కుండా, పాత ప‌ద్ద‌తికి మ‌ళ్లీ పోకుండా, ప‌రిస్థితులు దిగ‌జార‌కుండా, వారి రాజ‌కీయ స్వార్థాల‌కు బ‌లికాకుండా ఈ తెలంగాణ‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఊరికే రాలేదు తెలంగాణ‌. మ‌న బాధ‌లు చూడ‌న‌నివారు మ‌న అవ‌స్థ‌లు ప‌ట్టించుకోనివారు, న‌వ్విన వారు అడ్డం పొడ‌వు మాట్లాడుతున్నారు. చావు అంచు దాకా వెళ్లి ఈ రాష్ట్రాన్ని సాధించాను. తెచ్చిన త‌ర్వాత మీరు ఆశీర్వాదం ఇస్తే అనేక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నాం. ఈ ప‌థ‌కాల‌న్నీ కొన‌సాగాలి. ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ, వ్య‌వ‌సాయ రంగాల్లో ముందుకు పోవాలి. ఇంకా లాభం జ‌ర‌గుఉతంది. తాను క‌ల‌లుగ‌న్న బంగారు తెలంగాణ సాధ్య‌మైత‌ద‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

మ‌న రాష్ట్రం బాగుంటే స‌రిపోదు..
ఈ దేశంలో ఏం జ‌రుగుతుంద‌ని కేసీఆర్ ప్ర‌శ్నించారు. మన రాష్ట్రం బాగుంటే స‌రిపోదు. వివేకంతో మ‌నంద‌రం ఆలోచించాలి. తెలంగాణ అద్భుతంగా పురోగ‌మిస్తుంది. అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాం. కేంద్రంలో ఉన్న‌వారు మ‌నం ఇచ్చే వాటిని ఉచితాలు అని చెప్తున్నారు. కొంత‌మంది చిల్ల‌ర‌మ‌ల్ల‌ర‌గాళ్లు జెండాలు ప‌ట్టుకుని నా బ‌స్సుకు అడ్డం వ‌చ్చారు. అడ్డం వ‌చ్చిన ఆ ఐదారు మంది పోర‌గాళ్లను మ‌నోల్లు కొడితే తుప్పుతుప్పు అవుతారు. వారు ఏం ఉద్ధ‌రించారు. ఏం లాభం చేశారు. 8 ఏండ్ల నుంచి బీజేపీ ఒక్క మంచి ప‌ని చేసిందా? దీనిపై మీరంద‌రూ చ‌ర్చ పెట్టాలి. రాజ‌కీయంగా చైత‌న్యం లేని స‌మాజం లేకపోతే దోపిడికి గుర‌వుతాం. మోస‌పోతే గోస ప‌డుతాం. స‌మైక్య పాల‌కుల చేతిలో విల‌విల‌లాడిపోయారు. పెరుగు అన్నం తినే రైతులు పురుగుల మందు తాగి చ‌చ్చిపోయారు. ఆ బాధ‌లు మ‌ళ్లీ తెలంగాణ‌కు రావొద్దంటే మ‌నం అప్ర‌మ‌త్తంగా ఉండాలి. యువ‌కులు ముఖ్యంగా అప్ర‌మ‌త్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు.

ఒంటరి మహిళలు, వృద్ధులకు, భర్తలు చనిపోయిన ఆడవారికి గతంలో కేవలం 200 రూపాయల పెన్షన్ దక్కేదని, ఇప్పుడు రూ.2016 టంచన్‌గా ప్రతినెలా 36 లక్షల మందికి అందిస్తున్నామని కేసీఆర్ అన్నారు. ‘‘గతంలో ఇచ్చిన హామీ ప్రకారం, 57 ఏళ్లు పైబడిన వారికి కూడా పెన్షన్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నాం. 10 లక్షల పెన్షన్లు మంజూరు చేశాం. కరెంటు బాధలు పోయాయి. గతంలో కరెంటు ఎప్పుడొస్తదో? ఎప్పుడు రాదో? ఎన్ని మోటార్లు కాల్తయో? ఏసిన పంట పండుతదో లేదో తెల్వదు.
కానీ ఈనాడు వ్యవసాయానికి, పరిశ్రమలకు, దుకాణాలకు, ఇళ్లకు 24 గంటలూ అత్యుత్తమ విద్యుత్ అందించే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. మంచి నీళ్ల బాధ పోయింది. కరెంటు బాధ పోయింది. సంక్షేమం చేసుకుంటున్నం. దివ్యాంగులకు కూడా నెలకు రూ.3016 ఇచ్చి ఆదుకుంటున్నాం. ఆడపిల్లల పెళ్లికి కులమతాలతో సంబంధం లేకుండా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ స్కీంలతో ఆదుకుంటున్నాం. ఆస్పత్రులలో ఎలా ప్రసవాలు జరుగుతున్నాయో, వారికి కేసీఆర్ కిట్‌లు ఎలా అందిస్తున్నామో అందరికీ తెలుసు. ఇవి మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేవు.
కర్ణాటక ప్రజలు తమను తెలంగాణలో కలిపేయండి లేదా తెలంగాణలోని పథకాలను అమలు చేయాలని ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి అడుగుతున్నారు. తాండూరు వెళ్తూ ఉండే వాళ్లకు ఈ విషయం బాగా తెలుసు. గతంలో రైతులు నీళ్లు, కరెంటు లేక.. హైదరాబాద్ వచ్చి కూలీలుగా, ఆటోరిక్షావాలాలుగా పనిచేసేవారు. కానీ ఈరోజు పల్లెప్రగతి కార్యక్రమాలతో రైతాంగం అంతా ధీమాగా ఎకరానికి రూ.10 వేల రూపాయల పంట పెట్టుబడి తీసుకుంటున్న ఒకే ఒక రైతు ఇండియాలో తెలంగాణ రైతు. రైతులకు ఉచిత కరెంటే కాదు, ప్రాజెక్టులు ఉన్న చోట ఉచితంగా నీరు అందిస్తున్నాం.

గతంలో ఉన్న నీటి బకాయిలు కూడా రద్దు చేశాం. గతంలో ప్రమాదాల్లో రైతులు చనిపోతే ఆపద్భందు అని చెప్పి రూ.50 వేలు ఇచ్చేవాళ్లు. అది కూడా ఆరేడు నెలలపాటు ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరిగితే.. ఏ పదివేలో ఇచ్చి మిగతావి మేసేవాళ్లు మేసి మిగతావి రైతులకు ఇచ్చేవారు. పల్లె సీమలు పచ్చదనంతో కళకళలాడాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, పల్లెల్లో ఉన్న వారందరికీ పనులు దొరకాలనే ఆలోచనతో ప్రభుత్వం నేడు ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగానే గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా కూడా పదిరోజులు తిరగకముందే రైతుభీమా కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఏ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా.. ఎవరికీ లంచాలు పొందే అవకాశం లేకుండా.. నేరుగా బెనిఫీషియరీ ఖాతాలో జమ అవుతున్నాయి.’’ అని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్