Saturday, November 23, 2024
HomeTrending NewsSri Ramanavami:సత్యశీలత, ధర్మనిరతి శ్రీరాముని జీవితం - సిఎం కెసిఆర్

Sri Ramanavami:సత్యశీలత, ధర్మనిరతి శ్రీరాముని జీవితం – సిఎం కెసిఆర్

శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అన్యోన్య దాంపత్యానికి మారుపేరైన సీతారామచంద్రమూర్తులను తమ ఆరాధ్య దైవాలుగా ఇలవేల్పులుగా హిందువులు కొలుచుకుంటారని తెలిపారు. వసంత రుతువులోని చైత్రశుద్ధ నవమి నాడు ప్రతి సంవత్సరమూ ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా వాడ వాడనా వైభవోపేతంగా దేశ ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకోవడం గొప్ప విషయమన్నారు.
ఇంటికి పెద్ద కొడుకుగా, కుటుంబ బాధ్యతలకు కట్టుబాట్లకు అత్యంత విలువనిచ్చి, తండ్రి మాట కోసం కఠోర త్యాగాలను తన జీవితంలోకి ఆహ్వానించిన శ్రీరాముడు తర తరాలకు ఆదర్శనీయుడని సిఎం అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తాను నమ్మిన సత్యశీలత, ధర్మనిరతిని ఆచరించిచూపిన శ్రీరాముని జీవితం స్ఫూర్తిదాయకమని సీఎం అన్నారు.


కుటుంబ విలువలు క్షీణిస్తున్న వర్తమాన కాలంలో, సీతారాముల ఆశయాలను, విలువలను అన్వయించుకొని ఆదర్శవంతమైన కుటుంబ జీవనాన్ని కొనసాగించేందుకు శ్రీరామనవమి పండుగ ఒక ప్రత్యేక సందర్భమని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతీ యేటా జరిపినట్టే ఈ యేడు కూడా భద్రాచలం శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. శ్రీ సీతారామచంద్రస్వామి కృపాకటాక్షాలతో తెలంగాణ రాష్ట్రంతోపాటు, యావత్ భారతదేశం సుభిక్షింగా వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని సిఎం కేసీఆర్ ప్రార్థించారు.

Also Read : రాళ్లమయినా కాకపోతిమి రామపాదము సోకగా…

RELATED ARTICLES

Most Popular

న్యూస్