Language Problem: ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన నివేదికలతో తన ప్రభుత్వ పతనం ప్రారంభమైందని సిఎం జగన్ కు అర్ధమైందని, అందుకే అయన ఇలాంటి భాషను ఉపయోగిస్తున్నారని పీఏసీ ఛైర్మన్, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. తన భయాన్ని, బలహీనతలను కప్పిపుచ్చుకోవడం కోసం… లేని భీకరాన్ని ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా భాషలో స్వరాన్ని పెంచకూడదని, పాలనలో ప్రజల్ని ఆదుకోవడంలో వేగాన్ని పెంచాలని హితవు పలికారు.
ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల ప్రజల్లో ఆందోళన పెరుగుతోందని, ఇంటలిజెన్స్ నివేదికలు ఇదే విషయాన్ని చెబుతున్నాయని, దీనిపై ప్రజల దృష్టి మరల్చేందుకు, తన బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి, తాను ఇంకా బలంగా ఉన్నానని చెప్పుకునేందుకే ఇలాంటి పదాలు సిఎం ఉపయోగిస్తున్నారని కేశవ్ అభిప్రాయపడ్డారు.
ప్రతిపక్షాలతో పాటు మీడియాను కూడా సిఎం తిడుతున్నారని, ప్రభుత్వాలను మార్చే సత్తా ప్రజలకు ఉంటుంది కానీ, మీడియాకు లేదనే విషయం సిఎం కు తెలియడాని కేశవ్ ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపే మీడియా పైన, విపక్షాల పైన ఇలాంటి భాష వాడడం సరికాదన్నారు. చంద్రబాబు సిఎంగా ఉండగా కూడా ఇదే మీడియాపై ప్రతిపక్షనేతగా జగన్ ఎన్నోసార్లు విమర్శలు చేశారని, నిజంగా మీడియాకు అంత శక్తి ఉండి ఉంటే జగన్ గెలిచేవారా అని కేశవ్ నిలదీశారు.
సిఎం ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళుతున్నారని, తాను చేస్తున్న పనుల వల్ల ముఖ్యమంత్రికి పేరు రావడం లేదని… అందుకే ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, లేని గొప్పతనాన్ని చూపించుకోవదానికే ఇలాంటి భాష ఉపయోగిస్తున్నారని కేశవ్ వ్యాఖ్యానించారు. తాము రైతులకు ఇస్తూ వచ్చిన ఇన్ పుట్ సబ్సిడీని ఎత్తేశారని, డప్పు కళాకారులు, బెస్తవారికి తాము ఇచ్చిన పెన్షన్లను పీకేశారని, అన్నా క్యాంటిన్లు పీకేశారని కేశవ్ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి తన స్థాయికి తగని భాష మాట్లాడుతున్నారని, ఇకనైనా తన భాష మార్చుకోవాలని హితవు పలికారు.
Also Read : అసూయకు మందులేదు: సిఎం జగన్