రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం తగ్గితే ఆహార ధాన్యాల దిగుబడి ఎలా పెరిగిందో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోందని, పంటలకు సరైన మద్దతుధర లేక క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2019-20లో 175 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయితే ఈ ఏడు అది 69 లక్షల టన్నులకు పడిపోయిందన్నారు.
అగ్రికల్చర్ గ్రోత్ రేట్ కూడా 2022-23లో 4.54 శాతానికి పడిపోయిందని వెల్లడించారు. పరిస్థితి ఇలా ఉంటే సిఎం జగన్ అబద్ధాలు చెబుతున్నారని యనమల విమర్శించారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులను చేయి పట్టుకుని నడిపిస్తామన్న జగన్ ఈ ఏడాది బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు.