తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి మొదటి సంతకం కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల ఫైలుపై సంతకం చేశారు. రెండో సంతకం నిరుద్యోగ దివ్యాంగురాలు రజనికి ఉద్యోగ నియామక ఉత్తర్వు ఫైలుపై సంతకం చేశారు.
మొదటి నుంచి చెపుతున్నట్టుగానే ప్రగతి భవన్ దగ్గర రోడ్డు మీద ఏర్పాటు చేసిన కంచెను తొలగిస్తున్నామని…ఇక నుంచి ప్రగతి భవన్ కాదు జ్యోతిరావు ఫూలే భవన్ నామకరణం చేస్తున్నట్టు ప్రకటించారు. రేపు(డిసెంబర్-8) ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తామని…ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు అందరు రావచ్చని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
పాలకులం కాదు.. మేం సేవకులమని…ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధికి వినియోగిస్తామన్నారు. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా.. గుండెల్లో పెట్టుకుంటా…చూసుకుంటా అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసంతకం చేసిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇవే..
మహాలక్ష్మి పథకం – పేద మహిళలకు నెలకు రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్.
గృహజ్యోతి – ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
రైతు భరోసా – రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ 500 బోనస్.
యువ వికాసం – ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు.
.
చేయూత – రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రూ. 10 లక్షలు. నెలవారీ పింఛను రూ. 4,000.
ఇందిరమ్మ ఇళ్లు – ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు.
ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధి, రాహుల్ గాంధి, ప్రియాంక గాంధి, కర్ణాటక సిఎం సిద్ద రామయ్య తదితరులు హాజరయ్యారు.