Sunday, January 19, 2025
HomeTrending Newsదేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి

దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్, బిజెపి విధానాలు ఎండగడుతూ… విపక్షాల ప్రజా వ్యతిరేక పార్టీల పాలనలో ఏం జరుగుతోందో ప్రజలకు వివరిస్తున్నారు. క్యాడర్ లో జోష్ నింపేందుకు ఆదిలాబాద్ లో ఆత్రం సుగుణ, నిజామాబాద్ లో జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత మల్కజ్ గిరి సభలో పాల్గొన్నారు. నేతలను సమన్వయము చేస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణ మాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఉదయం ఆదిలాబాద్ జనజాతర సభలో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బిజెపి అభ్యర్థి ఆదివాసీల్లో దొర మాదిరి వ్యవహరిస్తారని… బీఆర్ఎస్ అభ్యర్థి ఉనికి కోసం యత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. తుమ్మిడి హట్టి ప్రాజెక్టు నిర్మించి తీరుతామని.. అందుకోసం మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. నాగోబా జాతరకు నాలుగు కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు.

కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు చేస్తామని.. బోథ్ ప్రాంతంలో కుప్టి ప్రాజెక్టు నిర్మించి రైతుల ఆకాంక్షలు నెరువేరుస్తామని సిఎం భరోసా ఇచ్చారు.  సిసిఐ సిమెంటు కార్మాగారాన్ని మూయించిన మోడీ, కెసిఆర్ తోడు దొంగలని దుమ్మెత్తి పోసిన సిఎం… ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వంద రోజుల్లో హామీలు నెరవేర్చలేదని అంటున్నారు. పదేళ్ళు అధికారంలో ఉంది హామీలు విస్మరించిన మోడీ, కెసిఆర్ లకు కాంగ్రెస్ ను విమర్శించే అర్హత లేదన్నారు.

ఆ తర్వాత నిజామాబాదు సభలో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి సెప్టెంబరు 17లోపు చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో కవిత ఎంపీగా ఎన్నికకాక ముందు వంద రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి చేయలేదని అన్నారు. అందుకే నిజామాబాద్ రైతులు కవితను, ఆమె జెండాను 100 మీటర్ల లోతులో పాతిపెట్టి.. 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా భయపడే పరిస్థితికి తెచ్చారని అన్నారు.

ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని మోదం చేసిన ధర్మపురి అరవింద్ కు అదే రీతిలో గుణపాటం చెప్పాలని పిలుపు ఇచ్చారు. నిజామాబాద్ రైతులకు అండగా వారి గళాన్ని పార్లమెంటులో వినిపించడం కోసం జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించి మరీ జీవన్ రెడ్డిని వ్యవసాయ మంత్రిని చేసే బాధ్యత నాదే అని అన్నారు. చక్కెర కర్మాగారాన్ని, పసుపు బోర్డును తెచ్చే సత్తా జీవన్ రెడ్డికి ఉందని అన్నారు. దేవుడు గుడిలో ఉండాలి… భక్తీ గుండెల్లో ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాని మోడీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.

సాయంత్రం మల్కజ్ గిరి ఎన్నికల సభలో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. పడిపోతున్న నన్ను నిలబెట్టిన మల్కజ్ గిరి ప్రజలను ఎన్నటికి మరువను అన్నారు. బిజెపి, బీఆర్ఎస్ ల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని అందుకే బలహీనమైన అభ్యర్థిని కెసిఆర్ నిలిపారని ఆరోపించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనకు దగ్గర అని చెప్పే ఈటెల రాజేందర్.. కెసిఆర్ అవినీతి మీద ఎందుకు విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. కేటిఆర్ తప్పులను ప్రశ్నించని ఈటెల నిజాయితీపరుడు అంటే ఎవరు నమ్ముతారన్నారు. మతాల మధ్య చిచ్చు  పెట్టె విధంగా మోడీ మాట్లాడుతుంటే… కమ్యూనిస్టు అని చెప్పుకునే ఈటెల రాజేందర్ దీనిపై ఏమంటారని ప్రశ్నించారు. మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీలను పొలిమేరల వరకు తరిమికొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.

బీఆర్ఎస్, బిజెపి విధానాలను ఎండగడుతూ మూడు లోక్ సభ నియోజకవర్గాల్లో సిఎం రేవంత్ రెడ్డి ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్