అంగన్‌వాడీల్లో చైల్డ్ గ్రోత్ మానిటరింగ్ ఎక్విప్‌మెంట్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీలలో నాడు-నేడు పనులపై ఆరా తీశారు. ఫౌండేషన్ స్కూళ్లుగా మారిన సుమారు 10 వేలకుపైగా అంగన్‌వాడీల్లో పనులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించగా, మిగిలిన 45వేల అంగన్‌వాడీల్లో కూడా ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు.
సమీక్ష సందర్భంగా సిఎం చేసిన సూచనల్లో ముఖ్యాంశాలు:
- అంగన్‌వాడీ సెంటర్లలో ఏయే సదుపాయాలు ఉన్నాయి? కల్పించాల్సినవి ఏంటి? అన్న దానిపై గ్రామ సచివాలయాల ద్వారా సమాచారం తెప్పించుకోవాలి
- ప్రతి అంగన్‌వాడీలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారుచేసి నివేదిక ఇవ్వాలి
- ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీచేయాలి
- మహిళా శిశుసంక్షేమశాఖలో ఖాళీలను కూడా భర్తీచేయాలలి
- సంపూర్ణపోషణ కింద పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన ఎస్‌ఓపీ రూపొందించాలి
- పెన్షన్లు ఎంత పకడ్బందీగా పంపిణీ చేస్తున్నామో.. సంపూర్ణ పోషణ పంపిణీ కూడా అంతే సమర్థవంతంగా చేయాలి
- క్రమం తప్పకుండా అంగన్‌వాడీలపై పర్యవేక్షణ జరగాలి, ఎప్పటికప్పుడు సెంటర్లను పరిశీలిస్తూ.. అక్కడి పరిస్థితులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలి
- సూపర్ వైజర్లపైన కూడా పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలి
ఈ సమావేశంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషాశ్రీచరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కే వీ వీ సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (మౌలిక సదుపాయాలు) కాటమనేని భాస్కర్, ఏపీ స్టేట్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ అండ్ ఎండీ వీరపాండియన్, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ ఎండీ అహమ్మద్ బాబు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం విజయ సునీత ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.