4th Year: రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించే ‘వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ యోజన’ పథకం నాలుగో ఏడాది తొలి విడత సాయాన్ని నేడు ప్రభుత్వం విడుదల చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు సోమవారం ఏలూరు జిల్లా గణపవరంలో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనార్టీ, కౌలు రైతులు, ఆర్వోఎఫ్‌ఆర్(అటవీ), దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతన్నలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింపజేస్తూ వారికి కూడా ఏటా 13,500 రూపాయల సాయం అందిస్తోంది. మొదటి విడతగా మే నెలలో జమ చేస్తున్న రూ.7,500తో పాటు రెండో విడతగా అక్టోబరులో రూ.4వేలు, మూడో విడతగా జనవరిలో రూ.2వేలు అందిస్తూ వస్తోంది.
నాలుగో ఏడాది మొదటి విడతగా మేలో ఇచ్చే రూ.7,500లకు గానూ రూ.5,500లను నేడు జగన్ ప్రభుత్వం జమ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం అందించనున్న పీఎం కిసాన్ నిధులు మరో 2 వేల రూపాయలు ఈ నెల 31న రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దీంతో మొత్తంగా నెలాఖరు నాటికి 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున దాదాపు రూ.3,758 కోట్లు అందనున్నాయి.
ఇప్పుడు అందిస్తున్న సాయం రూ.3,758 కోట్లతో కలిసి ఈ మూడేళ్లలో రైతన్నలకు శ్రీ వైయస్.జగన్ ప్రభుత్వం అందించిన మొత్తంలో కేవలం వైయస్సార్ రైతు భరోసా సాయం మాత్రమే రూ.23,875 కోట్లు. వివిధ పథకాల ద్వారా ఈమూడేళ్లలో రైతన్నలకు ప్రభుత్వం చేకూర్చిన లబ్ధి దాదాపు రూ.1,10,099.21 కోట్లు… అని ప్రభుత్వం వెల్లడించింది.
సిఎం జగన్ ఉదయం 10.10 గంటలకు ఏలూరు జిల్లా గణపవరం చేరుకోనున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వేదిక వద్దకు చేరుకుని వైయస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం డిగ్రీ కాలేజీ మైదానంలో జరగనున్న బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లి చేరుకోనున్నారు.
Also Read : నేడు నాలుగో ఏడాది మత్స్యకార భరోసా