తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. మరో మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాను కెసిఆర్ నేడు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు ఏపీలో కూడా ఎన్నికల హడావుడి మొదలైనట్లు కనిపిస్తోంది. లోకేష్ పాదయాత్ర, పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలతో ప్రజల్లోకి వెళుతున్నారు. చంద్రబాబు కూడా జిల్లాల పర్యటనలతో బిజీగా ఉన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రజా క్షేత్రంలోకి నేరుగా వెళ్లనున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష కార్యక్రమాల ద్వారా ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపిన జగన్ ఇకపై స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఈ నెలలో మూడు కార్యక్రమాలతో బిజీగా గడపనున్నారు.
విజయనగరంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న గిరిజన విశ్వ విద్యాలయానికి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో కలిసి ఈనెల 25 న సిఎం జగన్ శంఖుస్థాపన చేయనున్నారు.
28న ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించి జగనన్న విద్యాదీవేన కార్యక్రమం కింద విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్ మెంట్ నిధులను వారి తల్లుల అకౌంట్లలో జమ చేయనున్నారు.
౩౦న తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద 45 నుంచి 60 ఏళ్ళ మధ్య వయసు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు నాలుగో విడత ఆర్ధిక సాయాన్ని అందించనున్నారు. ఐదేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయాన్ని ఈ పథకం ద్వారా ఆడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సెప్టెంబర్ నుంచి వీలైనంత ఎక్కువ సమయం ప్రజల్లోనే ఉండేలా సిఎం జగన్ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.