CM to visit Vakulamatha: తిరుపతి రూరల్ మండలం పేరూరు బండపై కొలువైన వకుళామాత ఆలయ సంప్రోక్షణ కార్యక్రమాలు నిన్న, శనివారం నుండి ప్రారంభంయ్యాయి. ఈ నెల 23 వరకూ ఈ ఉత్సవాలు జరగనున్నాయి, చివరి రోజుల ఆలయ మహా సంప్రోక్షణ, విగ్రహ, ప్రాణ ప్రతిష్టా మహోత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చివరి రోజు జరిగే మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంతో పాటు శ్రీకాళహస్తి సమీపంలోని ఇనగలూరులో అపాచీ పరిశ్రమకు ఈనెల 23న భూమి పూజ చేస్తారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. 298 ఎకరాల్లో ఏర్పాటు చేస్తోన్న ఈ ఫుట్ వేర్ సెజ్ ద్వారా 10వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. తొలుత వకుళామాత పూజా కార్యక్రమాల్లో పాల్గొని తర్వాత అపాచీ పరిశ్రమకు భూమి పూజలో పాల్గొంటారని, ఆ తర్వాత ఏర్పేడు మండలం వికృతమాల సమీపంలోని టిసిఎల్ కంపెనీ వద్ద పారిశ్రామిక వేత్తలతో కూడా సిఎం సమావేశమవుతారని అమర్నాథ్ వివరించారు. విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాలను ఐటి హబ్ లుగా మార్చడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.