భాష దానికదిగా గాల్లో పుట్టి…నేలమీదికి ఊడి పడదు. మనమే పుట్టించాలి. అందుకే మాయా బజార్లో-
“ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి?”-అన్న మాటల మాంత్రికుడు పింగళి సూత్రీకరణే సర్వకాల సర్వావస్థల భాషా సిద్ధాంతమయ్యింది. భాషా శాస్త్రంలో నేను చదివింది సముద్రంలో ఆవగింజంతే అయినా…మాటల వ్యుత్పత్తి, వ్యాకరణం, మాండలికాల్లో మాటలను పలికే పద్ధతుల్లో తేడాలను తెలుసుకోవడం ఉత్సాహంగా ఉంటుంది. ఉన్న భాషకు వ్యాకరణం పుడుతుందే కానీ…వ్యాకరణం ముందు పుట్టి భాష తరువాత పుట్టదు. అలా పుడితే అది జీవ భాష కాదు. నిర్జీవ భాష.
ఏ భాషలో అయినా పారిభాషిక పదాలు(టెర్మినాలజీ) చాలా అవసరం. లేకపోతే ఒక పదంలో చెప్పాల్సిన మాటను అయిదారు వాక్యాల్లో చెప్పాల్సి వస్తుంది. తెలుగులో ప్రామాణిక భాషలో తయారు చేసుకున్న పారిభాషిక పదాల్లో తొంభై తొమ్మిది శాతం సంస్కృతమే ఉంటుంది. ఇంగ్లీషుతో పోలిస్తే ఇది నయం అనుకుని లోకం అంగీకరించింది.
మా వాచ్ మ్యాన్, డ్రయివర్లు, కెమెరామెన్లు, టెంత్, ఇంటర్ దాటి చదవలేదు. ఒకరిద్దరు అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చినవారు. వారితో మాట్లాడుతున్న ప్రతిసారీ నాకు భాషకు సంబంధించి ఎన్నెన్నో కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఎలిమెంటరీ స్కూల్ కు కూడా వెళ్లని డ్రయివర్ “పవర్ గడ్డ” మరిచిపోయినట్లున్నారు అన్నాడు. సెల్ ఫోన్ “పవర్ బ్యాంక్”కు అతడి తెలుగు పారిభాషిక పదమది. పవర్ బ్యాంక్ అన్న వస్తువే ఈ మధ్య పుట్టినది. “పవర్ గడ్డ” మాట కూడా ఈ మధ్యే పుట్టి ఉంటుంది. ఇంత సులభంగా, ఇంత అందంగా మాటలను సామాన్యులే సృష్టించుకుంటారు. బాగా చదువుకున్నవారేమో “స్థూల జాతీయ ద్రవ్యోల్బణ సూచీ పతన విషాద వైరాగ్య” లాంటి కొరుకుడు పడని పారిభాషిక పదాలను సృష్టిస్తూ ఉంటారు.
మొక్కలకు “వేరు పిండి” వేయాలి సార్ అంటాడు మా వాచ్ మ్యాన్. వేళ్ల దగ్గర వేసే పొడి మందుకు అతడి పారిభాషిక పదమది. తెలంగాణ నారాయణపేట్ జిల్లా(కర్ణాటక సరిహద్దు) నుండి బడికే వెళ్లకుండా, అక్షరాలు రాయడం కూడా తెలియకుండా వచ్చిన అతడి మాటల్లో వాక్యానికో అచ్చ తెలుగు పారిభాషిక పదం దొరుకుతూ ఉంటుంది నాకు.
చదువుకున్నవారికంటే చదువు లేని వారే తెలుగు మాటలను/పారిభాషిక పదాలను అత్యంత సహజంగా, అందంగా సృష్టించుకుని…చాలా హాయిగా వాడుకుంటున్నారు. అతి చదువరులమయిన మనకు అవి మొరటువి. మన అతి ప్రామాణిక, అతి నాజూకు భాషా వ్యవహారాల్లో వాడకూడనివి.
అచ్చ తెలుగుకు పాదుకు వారిది “వేరు పిండి”.
మనది సంస్కృతమో, ఇంగ్లీషో కలిపిన “వేరే పిండి”!
కొసమెరుపు:-
మొన్న ఒకరోజు నిజామాబాద్ నర్సింగ్ పల్లి ఇందూరు తిరుమల వెంకన్న ఆలయంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వక్తగా పిలిస్తే…వెళ్లాను. గంటకు పైగా మాట్లాడిన తరువాత ఒక గర్భిణీ స్త్రీ నాదగ్గరికొచ్చి వినయంగా రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి…మీతో రెండు నిముషాలు మాట్లాడవచ్చా? అని అడిగింది. నా ఉపన్యాసంలో ప్రస్తావించిన అన్ని మంత్రాలు, శ్లోకాలు, పద్యాలు, పాటలు, సామెతలు, మొత్తం ప్రసంగాన్ని సమీక్ష చేసినట్లుగా పదహారణాల చక్కటి తెలంగాణ మాండలికంలో వివరించింది. నేను చదువుకున్నదాన్ని కాను అంటూ…ఆమె రెండు నిముషాల్లో నేనేమి చెప్పానో…అంతకంటే అందంగా, క్లుప్తంగా చెప్పింది. చివర- మిమ్మల్ను వినే అదృష్టం దొరికింది ఈరోజు- ధన్యవాదాలు- అని మరోసారి నమస్కారం పెట్టి వెళ్లిపోయింది. బహుశా నేనైనా అక్కడక్కడా నాలుగు ఇంగ్లిష్ పదాలు వాడి ఉంటాను. ఆమె ఒక్క మాట కూడా ఇంగ్లిష్ వాడలేదు. నాలా కృత్రిమమైన ప్రామాణిక భాష మాట్లాడలేదు. సగటు మనిషి నిజామాబాదు వీధుల్లో అత్యంత సహజంగా మాట్లాడే పద్ధతిలో ఆధ్యాత్మిక ఉపన్యాసానికి అలవోకగా అనన్యసామాన్యమైన సమీక్ష చేసింది.
గుడిలోపల దేవుడు నా కళ్లు తెరిపించడానికి ఆమెను పంపినట్లున్నాడు. నా అజ్ఞానం కొంతైనా తొలగించడానికి ఆమె చేత నాకు విలువైన మాండలిక పాఠం చెప్పించినట్లున్నాడు. ఆమెను వినే అదృష్టం దొరికినందుకు నేను పొంగిపొయాను.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు