Saturday, November 23, 2024
HomeTrending Newsపత్రికా రంగానికి దిక్సూచి వై. గోవిందన్

పత్రికా రంగానికి దిక్సూచి వై. గోవిందన్

వై. గోవిందన్! తమిళనాడులోని పుదుక్కోట్టయ్ జిల్లాలో రాయవరంలో 1912 జూన్ 12 న జన్మించిన ఈయన చదివింది ఎనిమిదో తరగతి వరకే. బర్మాలో ఓ టేకు చెట్టు పరిశ్రమలోనూ, చెట్టినాడు బ్యాంకులోనూ పని చేసారు. అయితే వడ్డీ వ్యాపార సంస్థలో కొనసాగడం ఇష్టంలేక స్వదేశానికి తిరిగొచ్చేశారు. 1934లో మద్రాసులో లక్ష రూపాయల పెట్టుబడితో ఓ ప్రింటింగ్ ప్రెస్సు ప్రారంభించారు.

అంతేకాదు, చేతిలో ప్రెస్ ఉందన్న కారణంగా ఓ పత్రికకు శ్రీకారం చుట్టారు.దాని పేరు “శక్తి”. 1939లో ఆరంభమైన ఈ పత్రికను పదహారేళ్ళపాటు నడిపారు. మధ్యలో కొంతకాలం ఆపినా మళ్ళీ 1954లో పత్రికను పునఃప్రారంభించారు. మొత్తం 141సంచికలు వచ్చాయి. అదేసమయంలో వచ్చిన ఇతర పత్రికల ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఈయన నడిపిన శక్తి పత్రిక ధర వొట్టి నాలుగు అణాలు మాత్రమే. గాంధేయవాది అయిన వై. గోవిందన్ నడిపిన పత్రికలో గాంధీజీ చింతన, స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఉండేవి. అలాగే సామాజిక అంశాలు కూడా ఇచ్చేవారు.

కవియోగి శుద్ధానంద భారతియార్, తి.జ. రంగనాథన్ (తి.జ.రా), కు. అళగిరి స్వామి, సరస్వతి విజయభాస్కరన్ తదితరులకు ఈ పత్రికతో అనుబంధముండేది.

వల్లికణ్ణన్ అనే అలనాటి ప్రముఖ రచయిత శక్తి పత్రికను ప్రశంసిస్తూ తమిళంలో చిరు పత్రికలు అనే పుస్తకంలో “శక్తి కార్యాలయం వై.గోవిందన్ ముద్రణా రంగంలోను, పత్రికా రంగంలోను అపూర్వ సాధనలు సృష్టించారు. జ్ఞానాన్నిచ్చే మంచి మంచి పుస్తకాలనుసైతం ప్రచురించారు గోవిందన్. అనేక సంవత్సరాలు నడిపిన శక్తి పత్రిక ఓ విభిన్న తరహా పత్రికగా వెలువడుతుండేది. ఆరంభంలో టైమ్ పత్రిక తరహాలో వెలువడేది. అనంతరం పుస్తకరూపంలో వచ్చింది. ముఖపత్రం మందంగా ఉండేది. అందంగా ఉండేది. మంచి నాణ్యమైన కాగితంలో పత్రీక వెలువడేది. కొన్ని కథలు, ఒకటి రెండు కవితలు, రీడర్స్ డైజెస్ట్ బాణీలో రకరకాల వ్యాసాలు, మెదడుని ఆలోచింపచేసే అంశాలు ఈ పత్రికలో ఉండేవి. ప్రతి రచన ఆసక్తికరంగా ఉండేది. మంచి మంచి విషయాలు సేకరించి పొందుపరిచేవారు. ఈ పత్రికకు చాలాకాలం పాటు తి. జ. రంగనాథన్ సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయన తర్వాత శుభ. నారాయణన్ సంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత కు. అళగిరిస్వామి, తొ.ము.చి. రఘునాథన. బాధ్యతలు చేపట్టి శక్తి పత్రికకు కొత్తదనం తీసుకొచ్చారు.

1947లో వెలువడిన శక్తి పత్రిక ముఖచిత్రం ప్రముఖ అభ్యుదయ కవి భారతిదాసన్ తో వెలువడింది. రెండవ ప్రపంచయుద్ధంతో న్యూస్ ప్రింట్ కొరతతోనూ లక్ష్యాలకు భిన్నంగా వచ్చే ప్రకటనలను ముద్రించడానికి నిరాకరించిడంతోనూ ఆర్థిక సమస్యలు తలెత్తి శక్తి పత్రిక ఆగిపోయింది. అయిన ఇతర పత్రికలకు శక్తి పత్రిక మార్గదర్శకంగా ఉండేది. తమిళంలో మొట్టమొదటగా పిల్లలకోసం ఓ వారపత్రికను నడిపిన వై. గోవిందన్ “అనిల్” (ఉడుత)అనే పత్రికకు తమిళ్ వానన్ సంపాదకుడిగా వ్యవహరించారు. అలాగే మంగై (ఎడిటర్ – గుహప్రియయ్), పాప్పా,.కుయందైగళ్ సెయిది, కథై కడల్ అంటూ మరిన్ని పత్రికలనుకూడా గోవిందన్ సారథ్యంలో వెలువడ్డాయి. కథై కడల్ అనే పత్రిక చిన్న చిన్న కథలుమాత్రమే వెలువడేవి. ఆరోజుల్లో ఇదొక కొత్త ప్రయోగపత్రిక. వై. గోవిందన్ నడిపిన సినిమా పత్రికలోనే కవియరసు కణ్ణదాసన్ తొల రోజుల్లో పని చేశారు. దేశ విముక్తికి ముందూ వెనుకా అనేక రకాల పత్రికలను నడిపి తమిళంలో ఓ ఆదర్శవాదిగా ఖ్యాతి గడించారు.

అమూల్యమైన పుస్తకాలు కూడా వెలువరించిన గోవిందన్ గురించికూడా కొన్ని పుస్తకాలు వచ్చాయి. ఆయన 1966లో తుదిశ్వాస విడిచారు.

– యామిజాల జగదీశ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్