Saturday, September 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసైకిల్ నేర్చుకోవాలా?

సైకిల్ నేర్చుకోవాలా?

Health Cycle: సైకిల్ అంటే చాలా ఇష్టం నాకు. అలాగని అదేదో పార్టీ గురించి కాదు. సైకిల్ తొక్కడం ఇష్టం. ఆ కోరిక దాదాపు డిగ్రీ వరకు తీరలేదు.  టెన్త్ లో పక్కింటి తమిళమ్మాయి పాపు నేర్పినా సొంతంగా కొనుక్కుని తొక్కడం డిగ్రీ కి వచ్చాకే. దానికోసం ఎన్ని పోరాటాలు, నిరాహార దీక్షలో! కొన్న వెంటనే అత్యుత్సాహంతో నా అక్క తన స్నేహితురాలి ఇంటికెళ్లి వస్తూ పడటం, సైకిల్ పైనుంచి బస్ వెళ్లడం మర్చిపోలేని సంఘటన. ఎలాగో సైకిల్ రిపేర్ చేయించుకుని తొక్కడం ప్రారంభించాక మూడేళ్లు ఆగలేదు. ఎక్కడికయినా సైకిల్ పైనే. ఏదో స్వాతంత్య్రం వచ్చిన భావన. ఆ సంతోషం తర్వాత నా జీవితంలోకి స్కూటీ, కార్ వచ్చినప్పుడు కూడా కలగలేదు.

ఇటీవల ఓటిటి లో విడుదలైన స్వీట్ కారం కాఫీ సిరీస్ లో పొరపాటున పల్లెలో ఇరుక్కుపోయిన హీరోయిన్ కుటుంబానికి ఆశ్రయమిచ్చిన మహిళ సైకిల్ పై పనులు చక్కబెట్టుకుంటూ ఉంటుంది. ఆమెతో కలసి సైకిల్ తొక్కుతూ మధుబాల ఎంతో ఆనందిస్తుంది. చాలా పల్లెల్లో మహిళలు సైకిల్ నేర్చుకుని పనులు చక్కబెడుతున్నారు. కానీ చాలామందికి ఇది నెరవేరని కల….

…అన్నపూర్ణ వయసు అరవై ఏళ్ళ పైనే. అయితే సైకిల్ తొక్కాలనే చిన్న కోరిక ఇన్నాళ్ళుగా తీరలేదు.
నాలుగు ఇళ్లల్లో వంటలు చేసే ఒకామెకు నడచి వెళ్లి పనులు చేసేసరికి ఒంట్లో ఓపిక ఉండదు. సైకిల్ ఉంటే పని తేలికయ్యేది కదా అంటే మాకెవరు కొంటారు? ఎవరు నేర్పిస్తారు అంటుంది అమాయకంగా. చాలామందికి ముఖ్యంగా మహిళలకు సైకిల్ నడపడం ఒక కలగానే మిగిలిపోతోంది. అసలు చాలాకాలం సైకిల్ మరుగున పడి స్కూటీలు, కార్లు ఎక్కువయ్యాయి. అదే విదేశాల్లో సైకిల్ తొక్కేవారికోసం ప్రత్యేక మార్గాలు, అక్కడక్కడ సైకిల్ స్టాండ్స్ ఉంటాయి. మన దేశంలో ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా సైకిల్ తొక్కాలనే స్పృహ పెరుగుతోంది. ఇదొక మంచి వ్యాయామం కూడా.

హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రత్యేకంగా సైకిల్ కోసం దారి వేస్తున్నారు. వీటన్నింటికన్నా ప్రత్యేకంగా చెప్పుకోవలసింది సైకిల్ క్లబ్స్, సైకిల్ నేర్పే యాప్స్. పైన చెప్పుకున్న అన్నపూర్ణ కోరిక అలాగే తీరింది. బెంగళూరు కబ్బన్ పార్క్ లో డాక్టర్ పూనావాలా నిర్వహించే బెంగళూరు సైక్లింగ్ స్కూల్ ద్వారా ఆమె చిరకాల వాంఛ తీరడమే కాదు, మూడు నెలల్లోనే ఆమె కుమారుడు కొత్త సైకిల్ బహుమతిగా ఇచ్చాడు. సింగపూర్ వెళ్ళినప్పుడు కూడా హాయిగా సైకిల్ పై తిరగ గల్గిందీమె. ఇలా ఎంతోమందికి పూనావాలా సైకిల్ నేర్పిస్తున్నారు. ప్రతిఫలాపేక్ష లేకుండా ఆయన ఈ పని చేస్తున్నారు. గ్రీన్ పీస్ అనే సంస్థ తో కలసి పేద మహిళలకూ సైకిల్ నేర్పుతున్నారు. ఢిల్లీ వంటి నగరాల్లో పనిచేసే మహిళలు గ్రీన్ పీస్ సంస్థ ద్వారా సైకిల్ నేర్చుకుని సంతోషంగా పనులకు వెళ్తున్నారు. అనేకమందికి ఇదొక ఉపాధి మార్గంగా కూడా ఉంది. చదువుకుంటున్న విద్యార్థులు కూడా దీన్నొక ఆదాయమార్గంగా మలచుకుంటున్నారు.

కోల్ కతా కు చెందిన ఫల్గుణి రాయ్ అధికారి తన కుమార్తె తో కలసి ఎందరికో సైకిల్ నేర్పిస్తున్నారు. నేర్చుకునే వాళ్లలో ఎక్కువ శాతం మహిళలే. వారికి ఇదొక వ్యాయామంగా కూడా పనికొస్తోంది. బాగుంది, ఇకపై ఇటువంటి కోరికలు నెరవేరలేదని బాధపడకుండా చక్కగా నేర్చుకుని తొక్కుకుంటూ వెళ్లిపోవచ్చు. ముఖ్యంగా బకెట్ లిస్ట్ లో సైక్లింగ్ ఉంటే నేర్చేసుకోండి.

-కె.శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్