Friday, March 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకండోసుల మాయా బజార్

డోసుల మాయా బజార్

Confusion On Vaccine Dose Calculation

డోస్ అన్న ఇంగ్లీషు మాటకు తెలుగు మోతాదు ఉన్నా- మోతాదు మొరటుగా ఉన్నట్లు, డోస్ నాజూగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. పైగా మోతాదు అన్నది ఎంత పరిమాణం అన్న విషయం చెబుతున్నట్లుగా కూడా అనిపిస్తుంది.

అదే ఇంగ్లీషులో ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ అంటే ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుంది? ఇప్పుడే నా తాకే తెర చరవాణికి కోవిన్ సంక్షిప్త సందేశం వస్తే, వెళ్లి కరోనా టీకా మొదటి మోతాదు సూది పొడిపించుకుని వచ్చితిని- అని చెప్తే- ఆగాగు అనాగరికుడా!
ఏమంటివి? ఏమంటివి? అచ్చ తెనుగున అఘోరించితివా? అని పాత పద్యనాటక భాషలో అర్థం కాని సమాధానం వస్తుంది.

తెలుగు భాషలో తెలుగు ఇంగువకట్టిన గుడ్డ. అంతకు మించి చర్చలోకి వెళితే ఆ ఇంగువ కూడా ఇగిరి పోతుంది. ఆ గోచీ గుడ్డ కూడా మిగలదు.

Confusion On Vaccine Dose Calculation

వ్యాక్సిన్ డోస్ కు డోస్ కు మధ్య వ్యవధి పెరగడం మీద అనుమానాలు ముసురుకున్నాయి. డోసుల వ్యవధి విషయంలో కోవిడ్ వర్కింగ్ గ్రూపులో నిపుణుల మధ్య అభిప్రాయ భేదాలున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. కోవిషీల్డ్ మొదటి డోస్ కు రెండో డోస్ కు మధ్య వ్యవధిని 8 నుండి 12 వారాలకు పెంచాలని తాము సూచిస్తే – ప్రభుత్వం 12 నుండి 16 వారాలకు పెంచుకుందని వారు కోప్పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఏది సత్యం? ఏదసత్యం? ఏది శాస్త్రీయం? ఏది అశాస్త్రీయం? అన్న చర్చలోకి వెళ్లడం దండగ.

కోవిడ్ వర్కింగ్ గ్రూపు సభ్యులందరికి మన మాయా బజార్ సినిమా ఒక సారి చూపించాలి. అందులో తెలుగు సినిమా మాటలకు మంత్రస్థాయి కలిగించిన పింగళివారి మాటలు రెండున్నాయి.

1. ఘటోత్కచులవారు తన సహచరులకు చెప్పిన ప్రమాణవాక్కు-
“పాండిత్యం కంటే జ్ఞానమే ప్రధానం.”

2. బలరామ కృష్ణుల సమక్షంలో పురోహితులు మంచి ముహూర్తం కోసం శాస్త్ర చర్చ చేస్తున్నప్పుడు-
“అస్తు..అస్తు.. శాస్త్రమెప్పుడూ ఏం చెప్పినా నిష్కర్షగానూ, కర్కశంగానే చెబుతుంది. మనం సౌమ్యంగా సారాంశమే తీసుకోవాలి”

ఇప్పుడు పింగళివారి అనన్యసామాన్యమయిన అన్వయాన్ని ముందు పెట్టుకుని డోస్ ల శాస్త్ర చర్చ ఎవరికి వారు చేసుకోండి. వడ్లగింజలో బియ్యపు గింజ దొరికి పోతుంది. అరటి పండు ఒలిచి పెట్టినట్లు డోస్ వ్యవధి ఎందుకు పెరిగిందో తెలిసిపోతుంది.

కేంద్రం మన మాయాబజార్ అంత నిశితంగా చూసి ఉంటుందా అని మీకు సందేహం రావాల్సిన పనిలేదు. కేంద్రం చూడని మాయాబజార్ లు ఉండవు. కేంద్రం ఇవ్వని మాయా బజార్ లు ఉండవు. ఇది డోసుల మాయా బజార్. మోతాదుకు మించి శాస్త్ర సారం గ్రహించినా- పింగళులే మళ్లీ పుట్టినా రాయలేని ఆధునిక మాయా బజార్!

-పమిడికాల్వ మధుసూదన్

Read More టీకాకు దొరకని టీకా తాత్పర్యం

Read More మనిషి పుండు ఫార్మాకు ముద్దు

RELATED ARTICLES

Most Popular

న్యూస్