టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం పి.వి. సింధుకు అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు సిఎం జగన్, కెసియార్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బిజెపి నేతలు సోము వీర్రాజు, బండి సంజయ్ తదితరులు సింధుకు శుభాకాంక్షలు తెలిపారు.
మన దేశం నుంచి రెండు వరుస ఒలింపిక్స్ లో పతకాలు గెల్చుకున్న తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి తన అభినందన సందేశంలో పేర్కొన్నారు. జాతికే ఆమె వన్నె తెచ్చారని కొనియాడారు.
నేటి సింధు ప్రదర్శన యావత్ జాతినీ ఉప్పొంగేలా చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. మనదేశం నుంచి అద్భుతమైన ఒలింపిక్స్ క్రీడాకారిణిగా ఆమె నిలిచారని పేర్కొనారు.
బ్యాడ్మింటన్ లో కాంస్య పతకం సాధించడం దేశానికి, రాష్ట్రానికి గర్వకారణమని సిఎం జగన్ తన అభినందన సందేశంలో తెలియజేశారు.