Sunday, November 24, 2024
HomeTrending News9న కరీంనగర్ గడ్డపై కాంగ్రెస్ కవాతు : రేవంత్ రెడ్డి పిలుపు

9న కరీంనగర్ గడ్డపై కాంగ్రెస్ కవాతు : రేవంత్ రెడ్డి పిలుపు

తాగి బండి నడిపితే చంచల్ గూడ జైల్లో పెడితే.. తాగి రాష్ట్రాన్ని నడిపిస్తున్న కేసీఆర్ ను అండమాన్ జైల్లో పెట్టాలి. చొప్పదండి వేదికగా తెలంగాణ ప్రజలను ప్రశ్నిస్తున్నా. తెలంగాణలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించారు? తెలంగాణ ఇచ్చినందుకా? ఉచిత విద్యుత్ ఇచ్చినందుకా? ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినందుకా? ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలు అమలు చేసినందుకా? మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చినందుకా?” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను ప్రశ్నించారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా సోమవారం చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని పూడూరు నుంచి గంగాధర మండలం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం గంగధార చౌరస్తాలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు.
గత నెల 6న సమ్మక్క-సారలమ్మల ఆశీర్వాదంతో మేడారం నుంచి పాదయాత్ర మొదలుపెట్టాను. కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన పోతారం ప్రాజెక్టు, సంచార మైనార్టీ సోదరులు, బీడీ కార్మికులను, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను, ఈ ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన గంగవ్వను కలిసి ఇక్కడి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. కరీంనగర్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందో అనుకున్నా. కానీ అది చేయకపోవడంతో ఆయన అసలు రంగు బయటపడి ఇక్కడి ప్రజలు ఓడించేందుకు సిద్ధమయ్యారు. దీన్ని గమనించిన పాలమూరు జిల్లాకు వలస వచ్చిండు. అనాడు తెలంగాణ కోసం ఆయనను గెలిపించినం. ఏ ప్రాంతంలో కూడా సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కరీంనగర్ , వరంగల్ జిల్లాకు 13 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ హయాంలో నీళ్లు అందించాం. కాళేశ్వరం కట్టి కోటి ఎకరాలకు నీరుస్తామంటున్నారు టీఆర్ఎస్ నేతలు. కానీ అందులో చొప్పదండికి చుక్క నీరు రాలే.
దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, మైనార్టీలకు రిజర్వేషన్లు, గిరిజనులకు రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి, ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి, నిరుద్యోగభృతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతుకు రుణమాఫీ, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు..ఇలా చెప్పుకుంటూ పోతే తొమ్మిదేళ్లలో ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు.
నేషనల్ క్రైమ్ బ్యూరో ప్రకారం 2014 నుంచి 2023 వరకు 2 లక్షల మంది రైతులు చనిపోయారు. ఇంత మంది రైతులు చనిపోతే ఇది ఎట్ల బంగారు తెలంగాణ అయితది. ఇది బొందలగడ్డ తెలంగాణగా మారింది. అనాడు తెలంగాణ ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ కార్మికులు, విద్యార్ధులు, అమరుల కుటుంబాలు పాల్గొన్నారు. కేసీఆర్ చేతిలో మోసపోయి దీనావస్థలో ఉన్నారు. హోంగార్డులకు, పోలీసులకు ఇచ్చిన హామీలు కూడా కేసీఆర్ నేరవేర్చలేదు. 24 గంటలు శాంతిభద్రతలను కాపాడుతున్న మీకు పీఆర్సీ ఇవ్వకుండా దోపీడీ చేసిండు. సింగరేణి కార్మికులను, ఆర్టీసీ కార్మికులను, వీఆర్ఏలను, పంచాయితీరాజ్ ఉద్యోగుల దోపీడీ చేసిండు. ఎక్కడ చూసిన దోపీడి.
ఎక్కడ చూసినా దండుపాళ్యం ముఠా దోపిడీలకు పాల్పడుతోంది.
మానేరు వాగులో ఇసుక దందా చేస్తుంది కేసీఆర్ కుటుంబం కాదా. మానేరు వాగులో కేసీఆర్ సడ్డకుడు ఇసుక దోపిడీకి పాల్పడుతోంది వాస్తవం కాదా? ఇసుక దోపిడీకి, ధన దాహానికి దళిత బిడ్డ అడ్డుకుంటే.. నేరేళ్లలో వారిపై దాడులు చేయించాడు. వారిని పరామర్శించేందుకు వచ్చిన పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఆమోదించిన మీరాకుమారిని అవమానించిన దుర్మార్గుడు కేసీఆర్. నెరేళ్లలో దళితుల దాడుల సందర్భంగా ఎస్సీ కమిషన్ నివేదిక గురించి బండి సంజయ్ మాట్లాడిండు. మీ పార్టీ అధికారంలో ఉంది కదా ఎస్సీ కమిషన్ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదు? మరి ఎస్సీ కమిషన్ నివేదిక బయటపెట్టి బండి సంజయ్ నెరేళ్ల బాధితులను ఎందుకు ఆదుకోవడం లేదు. బోయినపల్లి వినోద్, బండి సంజయ్ ఈ ప్రాంతానికి చేసిందేం లేదు.
మన రక్తం, చెమటతో 10 ఎకరాలలో కట్టుకున్న ప్రగతి భవన్ లోకి పేదలను ఎందుకు రానివ్వడం లేదు? పోలీసుల పహారా మధ్య ప్రగతి భవన్… పాకిస్తాన్ ఇండియా బార్డర్ ను తలపిస్తోంది. అమరుల కుటుంబాలను ప్రగతి భవన్ కు పిలిచి బుక్కెడు బువ్వ పెట్టలేదు. ప్రగతి భవన్ పోవాలంటే పాస్ పోర్ట్, వీసా కావాలా. ప్రగతి భవన్లో ఆంధ్రా పెత్తందారీలతో మీరు చేస్తున్న కుట్రలు ఏమిటి. తెలంగాణ నా కుటుంబం అని చెప్పుకుంటున్న కేసీఆర్ కు ప్రగతి భవన్ వద్ద మర పిరంగుల కాపలా ఎందుకు?
కరీంనగర్ పోలీస్ కమీషనర్ గా ఒక ఆంధ్రా అధికారిని నియమించారు. కరీంనగర్ లో మేం సభ పెడతామంటే అనుమతులివ్వను అంటున్నాడు. కరీంనగర్ గడ్డ మీద సభ జరగనివ్వకుంటే.. కాంగ్రెస్ శ్రేణులతో కవాతు చేస్తాం. గంగులకు అనుమతి ఇచ్చి కాంగ్రెస్ సభకు ఎందుకు ఇవ్వరు? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ సభకు అనుమతి ఇవ్వనని ఆంధ్రా అధికారి అంటున్నడు. తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నా. ఈ నెల 9న కరీంనగర్ గడ్డపై కవాతు చేద్దాం తరలి రండి.

ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా.. లక్షల మంది బీఆరెస్ కార్యకర్తలు అడ్డు వచ్చినా కరీంనగర్ సభ జరిపి తీరతాం. ఏం జరిగినా, రక్తం చిందించయినా కరీంనగర్ గడ్డపై కవాతులో పాల్గొంటాం. భూపాలపల్లిలో రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేసినా ఓపిక పట్టాం. మా సహనానికి పరీక్ష పెట్టొద్దు. నలుమూలల కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నా. ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ కు మీరు తరలిరండి.. నేనూ వస్తా. ఎవడు అడ్డుకుంటాడో.. తుపాకీ తూటాలు వదులుతారో చూసుకుందాం. అనుమతులు ఇచ్చినా.. ఇవ్వకపోయినా..9న ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ లో సభ జరిపి తీరతాం..

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న రేవంత్ రెడ్డి
సోమవారం యాత్ర ప్రారంభానికి ముందు కొండగట్టు ఆంజనేయస్వామిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

పోతారం ప్రాజెక్టును సందర్శించిన రేవంత్ రెడ్డి

సోమవారం పాదయాత్రలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు పోతారం రిజర్వాయరును సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పోతారం చెరువు బ్యాక్ వాటర్ వల్ల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వానాకాలంలో రాకపోకలకు ఇక్కడి గ్రామాల ప్రజలకు అంతరాయం ఏర్పడుతోంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కొనాపూర్ లో 135 కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వలేదు. మత్తడి నిర్మాణం పూర్తి కాలేదనే సాకుతో బ్రిడ్జ్ నిర్మాణం సాగడం లేదు. నిర్వాసితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారికి పరిహారం అందించడంలేదు. కేవలం రూ.25 కోట్లు ఖర్చు పెడితే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లక్షల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్… ఇక్కడి ప్రజల సమస్యలు ఎందుకు తీర్చడంలేదు? తక్షణమే ఈ రోడ్ లో బ్రిడ్జ్ నిర్మించాలి. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం వల్ల మూడు నెలల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ సమస్యలను గ్రామాలకు సంబంధించిన రైతులతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళతారు. పనులు పూర్తి చేయకపోతే వచ్చే సోమవారం నుంచి స్థానిక కాంగ్రెస్ పోరాట కార్యాచరణ మొదలు పెడుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్