హైదరాబాద్ లోకసభ నియోజకవర్గం కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ కసరత్తు ప్రారంభించాయి. నియోజకవర్గంలో 18.22 లక్షల మంది ఓటర్లు ఉండగా అందులో 65 శాతం మైనారిటీలే. నాలుగు దశాబ్దాల నుంచి తిరుగులేకుండా ఎగురుతున్న పతంగిని దింపేందుకు కాంగ్రెస్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో మజ్లీస్ కు ఓటింగ్ శాతం తగ్గటంతో హస్తం నేతలకు ఆశలు చిగురించాయి.
ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు కంట్లో నలుసులా మారింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో మజ్లీస్ పోటీతో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓటమి చెందారు. దీంతో 20 ఏళ్ళుగా MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ ను హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ స్కెచ్ వేస్తోంది.
హైదరాబాద్ లో ఒవైసీ సోదరులను నిలువరిస్తేనే మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీ పోటీ చేయకుండా ఉంటుందని అంచనాగా ఉంది. మజ్లీస్ బచావో తహ్రీక్ (MBT) పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే యాకుత్ పురాలో ఎం.బి.టి అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది.
ఎంబిటి పార్టీని ఇండియా కూటమిలో చేర్చుకునేందుకు మిత్రపక్షాలతో కాంగ్రెస్ నేతలు ఇప్పటికే చర్చలు జరిపారు. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. పొత్తుల్లో భాగంగా లోక్ సభకు ఎంబిటి నేత అమ్జదుల్లా ఖాన్ ను బరిలో నిలపాలని… దీని ప్రభావం రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో కూడా ఉంటుందని విశ్లేషణ జరుగుతోంది.
మరోవైపు మెట్రో అలైన్ మెంటు మార్చటం ద్వారా ప్రజాధనం సద్వినియోగంతో పాటు పాతబస్తీలో పాగా వేసేందుకు పనికివస్తుందని కాంగ్రెస్ ఆలోచనగా ఉంది. ఎల్.బి నగర్ టు శంషాబాద్ విమానాశ్రయం, MGBS ఫలక్ నుమా మీదుగా విమానాశ్రయానికి తీసుకెళ్ళే మార్గంలో చాంద్రాయణగుట్ట జంక్షన్ గా మారనుంది. ఇది అందుబాటులోకి వస్తే పాతబస్తీ వాసుల దశాబ్దాల కల నెరవేరనుంది.
పాత నగరంలో పతంగి నేతలే అభివృద్ధి నిరోధకులుగా ఉన్నారని, పాతబస్తీ వాసులను MIM ఓటర్ల కోణంలోనే చూస్తోందని అక్కడి యువత, మేధావుల్లో అసంతృప్తి ఉంది. శాసనసభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ముస్లీం ఓటర్లు మజ్లీస్ నేతలను దూరంగా ఉంచారు. మజ్లీస్ -బిజెపి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ చేసిన ప్రచారం వీరిపై ప్రభావం చూపింది. లోక్ సభ ఎన్నికల్లో ఈ అంశాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి పోటీకి కాంగ్రెస్ నుంచి క్రికెటర్ అజరుద్దీన్, ఫిరోజ్ ఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరు కాకుండా ఒకరిద్దరు ముస్లీం పారిశ్రామిక వేత్తలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఎంబిటి అధినేత అమ్జదుల్లా ఖాన్ పోటీ చేస్తే అసదుద్దీన్ ఒవైసీకి దీటుగా ఉంటుందా… ఇలా పలు విధాలుగా మేధోమధనం జరుగుతోంది.
శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఉపులో మజ్లీస్ ను మట్టుబెట్టాలనుకుంటున్న కాంగ్రెస్… పతంగిని దింపే క్రమంలో చేతుకు గాయం అవుతుందా చూడాలి.
-దేశవేని భాస్కర్