గ్రామపంచాయితీలకు వివిధ బకాయిల కింద ఇవ్వాల్సిన దాదాపు రూ. 35 వేల కోట్లను కొల్లగొట్టిన గజదొంగ కేసీఆర్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో సర్పంచ్ లకు నిధుల విడుదల, ప్రభుత్వ నిర్లక్ష్యంపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ధర్నా చౌక్ కు వెళ్లబోతున్న రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయంత్రం విడుదల చేశారు. అనంతరం బొల్లారం పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు. పల్లె సీమలే దేశాని పట్టు గొమ్మలు అన్న మహాత్మాగాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయితీలకు నిధులు, విధులను కేటాయించింది. రాజీవ్ గాంధీ గారు తన హయాంలో 73,74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయితీలకు నేరుగా నిధులిచ్చి ఆ నిధులపై సర్పంచులకు సర్వాధికారాలను కట్టబెట్టారు. కానీ కేసీఆర్ ఆ స్ఫూర్తి మరిచి పంచాయితీరాజ్ సంస్థలను నాశనం చేస్తున్నాడు. గ్రామ పంచాయితీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించింది. నెలనెలా పంచాయితీలకు చెల్లించాల్సిన వందలాది కోట్ల నిధులను ఇవ్వకుండా మరోవైపు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వేలాది కోట్ల రూపాయాల 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయితీలకు చేరకుండా ఈ ప్రభుత్వం కొల్లగొట్టింది. గ్రామపంచాయితీలకు వివిధ బకాయిల కింద ఇవ్వాల్సిన దాదాపు రూ. 35 వేల కోట్లను కొల్లగొట్టిన గజదొంగ కేసీఆర్. ఈ గజదొంగను జైళ్లలో పెట్టాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగమైతే ఈ అంశం మీద విచారణ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు ఎందుకు డిమాండ్ చేయడం లేదు.
సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయితీలన్నీ ఆర్థికంగా నిర్వీర్యమయ్యాయి. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించే పరిస్థితికి పంచాయితీలు చేరుకున్నాయి. తండాలను పంచాయతీలు చేశానని కేసీఆర్ గొప్పలు చెబుతున్నారు. ఏ తండాలోని పంచాయితీలకైనా పక్కా భవనాలు కట్టించారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గ్రామాల్లో సశ్మానవాటిక, పల్లె ప్రకృతివనం తదితర పనుల కోసం సర్పంచులు సొంత నిధులతో చేపట్టారు. వీటి బిల్లులను సకాలంలో విడుదల చేయకపోవడంతో మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో ఆనంద్ రెడ్డి అనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మునుగోడులో సర్పంచ్ బస్టాండ్ లో బిచ్చమెత్తాడు. సూర్యాపేట జిల్లాలో శాంతమ్మ అనే మహిళా సర్పంచి తాళి అమ్ముకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.35 వేల కోట్ల పంచాయితీ నిధులను దొంగిలించి మెగా కృష్ణారెడ్డి, ప్రతిమ శ్రీనివాస్ వంటి బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తుంది. వారి నుంచి కమీషన్ తీసుకుంటుంది. ఇసుక, రిజిస్ట్రేషన్ నుంచి వచ్చే ఆదాయం కూడా పంచాయితీలకు దక్కడం లేదు. ఇవన్నీ ప్రభుత్వ ట్రెజరీలో జమ అవుతున్నాయి. అటునుంచి తిరిగి గ్రామపంచాయితీలకు జమ కావడం లేదు.
దీంతో గ్రామపంచాయితీలకు ఆదాయ వనరులు తరిగిపోతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో సర్పంచులకు అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సర్పంచ్ లకు కాంగ్రెస్ అండగా ఉంటామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపకుండా కాంగ్రెస్ నాయకులను ఎక్కడిక్కడ అరెస్ట్ చేసింది. కొందరి పట్ల దురుసుగా ప్రవరిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మా నాయకురాలు విజయారెడ్డి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఇది మంచి పద్ధతి కాదు. అన్ని గుర్తుపెట్టుకుంటాం. ఎల్లకాలం కేసీఆర్ అధికారంలో ఉండడు.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.
గతంలో కేసీఆర్ శాసనసభలో ఉపవాసం ఉండైనా పంచాయితీలకు నిధులను విడుదల చేస్తాం అన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తారో తెలియదు. పంచాయతీ నిధులను వెంటనే విడుదల చేయాలి. ఆత్మహత్యలకు పాల్పడ్డ సర్పంచ్ ల కుటుంబాలను ఆదుకోవాలి. హైకోర్టులో అనుమతి తెచ్చుకుని ధర్నా చౌక్ లో ధర్నా చేసి తీరతాం. సర్పంచులు మంత్రులను అడ్డుకుని నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నా. మంత్రుల కార్యక్రమాలు బహిష్కరించండి. మీకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.. మీకోసం కొట్లాడుతుంది. పోలీసులు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారారు. డీజీపీ అంజనీకుమార్ మమ్మల్ని అరెస్టు చేసి ప్రభుత్వానికి నజరానా ఇవ్వాలనుకున్నారు. ధర్నా చౌక్ లో ధర్నాకు అనుమతి అవసరం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కేసీఆర్ తెలంగాణకు పరాయివాడు, కిరాయివాడు
తెలంగాణతో టీఆర్ఎస్కు పేరుబంధం ఉండేదని.. పార్టీ పేరు మార్పుతో పేగు బంధం తెగిపోయిందన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణకు పరాయివాడు, కిరాయివాడు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీహార్ అధికారుల రాజ్యం నడుస్తోందని రేవంత్ అన్నారు. కేసీఆర్ కు కాలం చెల్లిపోయిందని.. ఇంకో ఐదారు నెలలు మాత్రమే అధికారంలో ఉంటారన్నారు. బీహార్ తో కేసీర్ కు రక్త సంబంధం ఉంది. 2008లో ఒక చానెల్లో తమ పూర్వీకులు బీహార్ నుంచి వచ్చారు అని కేసీఆర్ స్వయంగా చెప్పిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. త్వరలోనే కేసీఆర్ బీహార్ కు పారిపోవడం ఖాయమన్నారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై బీజేపీ ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు? వైషమ్యాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందలనుకుంటున్నారు. అయ్యప్ప స్వాములను దూషించిన విషయంలో కూడా రాజకీయ కుట్ర దాగుంది. వెస్ట్ బెంగాల్ తరహా వ్యుహాన్ని తెలంగాణలో అమలు చేయాలని బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ, బీఆరెస్ రాజకీయ లబ్ది కోసమే కుట్రలు చేస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పార్టీ ఫిరాయించిన 12మందిని కూడా విచారించాలి. పిరాయింపుల్లో అధికార దుర్వినియోగం జరిగింది. సబిత ఇంద్రారెడ్డికి మంత్రి పదవి, సుధీర్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్, కాంతారావుకు విప్ పదవి, మరికొందరికి ఇతర లబ్ధి చేకూర్చారు. కోట్ల రూపాయలు చేతులు మారాయి. వీటీపై విచారణ చేయాల్సిన బాధ్యత కేంద్రం పై ఉంది. తెలంగాణను అవమానించేలా కేసీఆర్ వ్యవహరించడం క్షమించరాని నేరం. అందుకే పార్టీకి బీఆరెస్ అని పెట్టారు.