Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతనను తానే దహించుకునే కాంగ్రెస్

తనను తానే దహించుకునే కాంగ్రెస్

Weapons to opponents: అది 3023వ సంవత్సరం. అంటే ఇప్పటికి సరిగ్గా వెయ్యేళ్ల ముందు మాట. అత్యంత అధునాతన ఎగ్జిబిషన్. వెయ్యేళ్ల కింద… ఒకానొక రాజకీయ పార్టీ ఎలా పుట్టి…ఎలా పెరిగి...ఎలా విరిగి…ఎలా తరిగిపోయిందో…వివరిస్తూ పురావస్తు శాఖవారు ఎగ్జిబిషన్ కు వచ్చిన సందర్శకులకు పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. సందర్శకులు అయ్యో అని వర్చువల్ కన్నీరు కార్చి వెళ్లిపోతున్నారు.

పురావస్తు శాఖవారు దేశంలో వివిధ ప్రాంతాల్లో పి సి సి కార్యాలయాలున్న చోట్ల, ప్రత్యేకించి ఢిల్లీ ఏ ఐ సి సి ఉన్న చోట అనేక పర్యాయాల్లో జరిపిన తవ్వకాల్లో బయటపడిన విషయాలను క్రోడీకరించి సందర్శకులకు సులభంగా అర్థం కావడానికి వీలుగా ఆడియో, వీడియో, ఫోటోల కథనాలను ప్రపంచంలోని అన్ని భాషల్లో తయారు చేశారు. దాని సారాంశమిది.

1. భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీగా దేశం కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ ను నెత్తిన పెట్టుకుని…అధికారాన్ని అప్పగించింది.
2. కొంతకాలం గడిచేసరికి కాంగ్రెస్ పార్టీ అత్యంత పేదదయి…అందులోని నాయకులు దేశం పట్టనంత సంపన్నులు అయ్యారు.
3. కాంగ్రెస్ నుండి చీలి బయటికొచ్చినవారు అధికారంలోకి రాగలిగారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూడా ఉండలేక తనకు తానే అంతర్ధానమయ్యింది.
4. ప్రతి పార్టీకి ఒక డి ఎన్ ఏ ఉంటుంది. కాలగతిలో కాంగ్రెస్ డి ఎన్ ఏ ఏమిటో తెలియక డి ఎన్ ఏ శాస్త్రవేత్తలే చేతులెత్తి క్షమించాల్సిందిగా కోరారు.
5. ఎప్పుడు ఏమి మాట్లాడితే ప్రత్యర్థి చేతికి అయాచితవరం లాంటి ఆయుధం ఇచ్చినట్లవుతుందో కాంగ్రెస్ కు తెలిసినట్లుగా ఈ భూ ప్రపంచంలో ఇంకే పార్టీకి తెలియదు.


6. ఎన్నికల ఫుట్ బాల్ రాజకీయ క్రీడలో కాంగ్రెస్ నాయకులందరూ పోటీలు పడి సెల్ఫ్ గోల్ వేసుకునేవారు. దాంతో ప్రత్యర్థి బలంగా ఓడిపోవాలనుకున్నా…ఎప్పుడూ కాంగ్రెస్సే ఓడిపోయి…నామరూపాల్లేకుండా పోయింది.
7. తనతో తానే విభేదించుకుని, తనతో తానే సంఘర్షించుకుని, తనతో తానే కలహించుకుని, తనలో తానే దహించుకుపోయిందే తప్ప…కాంగ్రెస్ ను ఒకరు పనిగట్టుకుని ఓడించలేదు.
8. శిథిలాల నుండి శిఖరాలకు, బూడిద నుండి భువనాలకు ఎగబాకిన స్ఫూర్తి దాయక కథనాలను వింటూ…ఎప్పటికయినా కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతుందా? అని కొన్ని తరాలు చకోర పక్షుల్లా ఎదురు చూసి…చూసి…తీరని కోరికతో పోయాయి.

9. దేశానికి కాంగ్రెస్ అవసరం ఉందని దేశ ప్రజలు అనుకున్నా…కాంగ్రెస్ ఆ అవసరాన్ని గుర్తించలేక “పోయింది”. గుర్తించినా ఏమీ చేయలేక “పోయింది”. చేసినా…కోవర్టులు ఎక్కువై “పోయింది”.
10. “పోయినోళ్లు అందరూ మంచోళ్లు. ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు…” అన్నాడు ఆత్రేయ. అందుకు గుర్తుగా వెయ్యేళ్ల కిందట “పోయిన” ఒక పార్టీ గురించి మీరు ఇంతదాకా తెలుసుకున్నారు. ఇక దయచేయండి.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

Also Read :

రాహుల్ కు తెలిసిన సావర్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్