తెలంగాణలో 2023 ఎన్నికలు ఓ ప్రత్యేకత సంతరించుకున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఆ మాటకొస్తే గతంలో కూడా ముఖ్యమంత్రులు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఈ దఫా సిఎం కెసిఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో విపక్షాలకు చెందిన అగ్రనేతలు పోటీచేయటం… వారు వారి సొంత నియోజకవర్గాల్లో కూడా బరిలో ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్,బిజెపిలు అనుకునే చేస్తున్నాయా అన్నట్టు ఒక పార్టీ గజ్వేల్…మరో పార్టీ కామారెడ్డిలో దిగ్గజాలను రంగంలోకి దించాయి.
గజ్వేల్లో బిజెపి అభ్యర్థిగా ఈటెల రాజేందర్ బరిలోకి దిగారు. హుజురాబాద్ నుంచి ఇప్పటికే రంగంలో ఉన్న ఈటెల…ఇక్కడ కూడా పోటీ చేస్తున్నారు. సిఎం మీద ఉన్న వ్యతిరేకత, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులు, నిరుద్యోగుల నిరసనలతో పాటు తన సామాజిక వర్గం ముదిరాజ్ ఓట్లు గట్టేక్కిస్తాయని భరోసాతో ఉన్నారు. బీఆర్ఎస్ అసంతృప్తి నేతలను దగ్గరికి తీసుకున్నారు.
గజ్వేల్లో 50 వేల వరకు ముదిరాజ్ ఓట్లు ఉన్నాయి. రాజేందర్ తన సామాజిక వర్గాన్ని ఓట్ల కోణంలోనే చూశాడు తప్పితే… ఏనాడు వారిని దగ్గర తీసిన పాపాన పోలేదని విమర్శలు ఉన్నాయి. ఆయన కుమారుడు, కుమార్తె రెడ్డి కులంగానే ఇతరులకు పరిచయమని..ముదిరాజ్ గా వారు ఎప్పుడు చెప్పుకోలేదని అంటారు. ఈటెల నివాసంలో పెత్తనం అంతా ఆయన భార్య జమునదేనని ఇంట్లో డ్రైవర్లు, నౌకర్ల దగ్గరనుంచి అందరు ఆమె సామాజిక వర్గం వారేనని చెప్పుకుంటారు. ముదిరాజ్ అని చెప్పుకునే రాజేందర్ రాజకీయంగా తన ఎదుగుదల కోసమే కులం కార్డు వాడుతారని ఆరోపణలు ఉన్నాయి.
గజ్వేల్లో అభివృద్ధి జరిగింది వాస్తవం. కర్ర ఉన్నవాడిదే పెత్తనం అన్నట్టు…కెసిఆర్ కటాక్షం ఉన్న వారికే అన్నీ దక్కాయని అంటారు. ఎర్రవల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చినపుడే అసంతృప్తులు మొదలయ్యాయి. ఇళ్ళ కోసం స్థలం ఇచ్చిన వ్యక్తికి కాకుండా ఇతరులకు కేటాయించటం, హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉన్న వారికి ఎర్రవల్లిలో ఇల్లు ఇవ్వటం వివాదాస్పదం అయింది. స్థలం ఇచ్చినా తనకు ఇల్లు కేటాయించలేదనే ఆవేదనతో ఓ పెద్దాయన చనిపోతే…మీడియాను మేనేజ్ చేసి అప్పటి కలెక్టర్ ఇప్పుడు పార్టీ నేతగా ఉన్నాయన అంత్యక్రియలు పూర్తి చేయించారని ఆరోపణలు ఉన్నాయి.
కెసిఆర్ ఫాం కోసం మొదట చెరువులో బోర్లు వేశారని, ఆ తర్వాత కాలువ తీసుకొచ్చారని స్థానికులు చెపుతారు. ఫాం హౌస్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న ఓ వ్యక్తి… ఏ పథకం వచ్చినా లబ్దిదారుల నుంచి కమీషన్లు తీసుకుంటారని ఆయన చెప్పిన వారికే రుణాలు, పథకాలు అందుతాయనే పేరుంది.
మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితుల వ్యవహారంలో ప్రభుత్వ కర్కశత్వం, న్యాయస్థానాల మొట్టికాయలు ఓటర్ల మస్తిష్కం నుంచి చెదిరిపోలేదు. కెసిఆర్ ఎమ్మెల్యే అయ్యాక చుట్టుపక్కల జిల్లాల నుంచి ఉపాధి కోసం అనేకమంది వచ్చి గజ్వేల్లో స్థిరపడ్డారు. ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆశపడ్డారు. అధికార పార్టీ నాయకుల బంధువులకు, అనుచరులకే లబ్ది చేకూరిందని వినికిడి. అన్ని ప్రభుత్వ భవనాలు బంగాళాలుగా మారాయని… నిరుద్యోగులకు ఉపాధి కోసం సరైన పరిశ్రమ తీసుకురాలేదని స్థానికులు వాపోతున్నారు.
కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న తుకుంట నర్సారెడ్డి.. తాను లోకల్ అని వాళ్ళిద్దరు ఇతర ప్రాంతాల వారని ప్రచారం చేస్తున్నారు. కెసిఆర్ ను ఓడగోడితే కాంగ్రెస్ ఆధ్వర్యంలో వచ్చే ప్రభుత్వంలో ఉన్నతపదవి లభిస్తుందని ప్రజల్లోకి వెళుతున్నారు. ఈటెలకు ఈ దఫా హుజురాబాద్ లో ఎదురుగాలి వీస్తోందని వార్తలు వస్తున్నాయి. కెసిఆర్ మీద వ్యక్తిగత కక్షతోనే వచ్చిన రాజేందర్ ను గజ్వేల్ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.
సిఎం కెసిఆర్ పోటీ చేయటం…కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బరిలోకి దిగటంతో కామారెడ్డిపై ఆసక్తి నెలకొంది. కెసిఆర్ రావటంతో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ కు మారారు. కెసిఆర్ ను ఎదుర్కోవటం ఆర్థికంగా భారం కావటం, నిజామాబాద్ అర్బన్ లో మైనారిటీ ఓట్లు అధికంగా ఉండటం కలిసివస్తుందని షబ్బీర్ అలీ మారారని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. షబ్బీర్ అలీ మచి నిర్ణయమే తీసుకున్నారని చెప్పాలి. బిజెపి నుంచి వెంకట రమణ రెడ్డి పోటీ చేస్తున్నా కమలం ఎంతవరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
కామారెడ్డిలో కెసిఆర్ మీద పోటీ ఎవరని అనేక చర్చలు జరిగాక రేవంత్ రెడ్డి పేరు ఖరారైంది. కోడంగల్లో ఈ దఫా రేవంత్ గెలుపు ఖాయమనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ సిఎం అవుతారని కొడంగల్ ప్రజలు భావిస్తున్నారు. రెండు కామారెడ్డిలో ఏ మేరకు సత్తా చాటుతారో…కాంగ్రెస్ బలం ఏంటో మరికొద్ది రోజుల్లో బయట పడనుంది.
సిఎం తరపున హరీష్ రావు గజ్వేల్ బాధ్యతలు తీసుకోగా..కామారెడ్డి బాధ్యతలు కేటిఆర్ చేపట్టారు. ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డిలు రెండు నియోజకవర్గాలలో ప్రచారం చేయటం..ప్రజలను కలవటం, పార్టీ శ్రేణులను కలుపుకుపోవటంలో ఏ మేరకు సమన్వయము చేస్తారో చూడాలి.
-దేశవేని భాస్కర్