చిలుక కొరికిన పండు తీయన అని అనుకుంటాము. ఆ పండు రుచే రుచి. చిలుక కొరకడంవల్ల పండు తియ్యగా మారదు…మొత్తం చెట్టుకాయల్లో ఏది తియ్యగా ఉంటుందో పసిగట్టి దాన్నే చిలుక కొరుకుతుంది. నృసింహ శతకంలో అడవిపక్షులకెవడు ఆహారమిచ్చెను ? అని ప్రశ్న. అడవి పక్షుల ఆహారం గురించి అక్కినేని అమలలాంటివారు చూసుకుంటారు. ముందు జనారణ్య పక్షులమయిన మనం తినే ఆహారం ఎంత ఆరోగ్యంగా ఉందో తెలుసుకుంటే వీధివీధికి కార్పొరేటు ఆసుపత్రులు మూడు బెడ్లు ముప్పైమంది రోగులుగా ఎందుకు క్షణక్షణప్రవర్ధమానమవుతున్నాయో అర్థమవుతుంది.
బాహుబలి భుజబలంతో ప్రపంచరికార్డులను ఎలా కొల్లగొట్టిందో? ఒకే రోజు సాహో పదివేల ప్రపంచ తెరలమీద తెరలు తెరలుగా అరారా ఆరు షోలుగా జగతి సాహో సాహో అంటుండగా గ్రాఫిక్స్ గిజిగూడులో ప్రేక్షకులు ఎలా ఆనందపరవశంతో కాళ్ళుచేతులు కొట్టుకుంటున్నారో? లాంటి అత్యవసర, జీవన్మరణ వార్తల వెల్లువలో జీవవైవిధ్య సదస్సులాంటి పరిశోధనలు, పరిశీలనలు, విశ్లేషణలు, హెచ్చరికలు, జాగ్రత్తలు ఎవరికీ పట్టవు.
ఆమధ్య రైల్వే కోడూరులో వ్యవసాయం చేసే మా బంధువు మంచి కడప మాండలికంలో వెటకారం దట్టించి ఒక విషయం చెప్పాడు. ఆ ప్రాంతంలో వేసవిలో దోసకాయలు పండిస్తారు. మండువేసవిలో వాడిని కలిశాను. ఏరా ! నాలుగు దోసకాయాలన్నా ఇస్తే, పొలాల్లో నుండి తాజాగా కోసినవని తృప్తిగా హైదరాబాద్ లో తింటాను అన్నాను. లారీలకెక్కించి పూనాలో అమ్ముకుంటారట. వద్దు బావా! శత్రువుకు కూడా ఈ దోసకాయలు ఇవ్వను – నీకు అసలివ్వను అన్నాడు. కారణం కనుక్కుంటే నా అనేవారిమీద వాడి ప్రేమాభిమానాలు దోసకాయలు ఇవ్వకపోవడంలోనే ఉన్నాయని తెలిసింది . ఒకమోస్తరు పిందె నుండి దోసకాయలు కోసి లారీకెక్కించే లోపు నాలుగుసార్లు పురుగులమందు చల్లుతారట. ఈ మందులవల్ల కాయకు పురుగు పట్టదు, కాయ గట్టిగా ఉంటుంది, దిగుబడి పెరుగుతుంది. రేటు ఎక్కువ వస్తుంది. కోసిన తరువాతకూడా ఎక్కువరోజులు కాయ అలానే గట్టిగా ఉంటుంది. తిన్నవాడి కడుపులో పురుగులమీద కూడా దోసకాయ తిన్నకృతజ్ఞతతో యుద్ధం చేస్తే అదనపు లాభం. ఇదివరకే కడుపులో చల్లగా సేదతీరుతున్న పురుగులు స్థానబలం, సీనియారిటీవల్ల కొత్త మందును ఓడిస్తే మొదటికే మోసం. ఆతరువాత డాక్టరయినా చాగంటిలాగే మానవప్రయత్నం చేశాం – ఇక దేవుడే దిక్కు అని భుజాలెగరేసి దైవచింతనకు వెళ్లాల్సిందే.
వారం వారం హైదరాబాద్- విజయవాడల మధ్య తిరుగుతూ ఉండే నేను ఒక వారాంతంలో హైదరాబాద్ వస్తూ టీ తాగడానికి కోదాడకు ముందు హైవే పై ఒక డాబా దగ్గర ఆగాను. ఫ్లాస్కులో వారం కిందటి టీ కాకుండా నాముందు టీ తయారుచేసి ఇవ్వమని అడిగాను. పదినిముషాలు ఆగమన్నాడు. ఈలోపు తెలుగులో అనర్గళమైన బూతులు వినపడుతూ ఏదో గొడవ జరుగుతున్నట్లనిపించి…పక్కన జనం మూగినచోటికి వెళ్లా. అది గొడవకాదు . నాలుగయిదు ట్రాక్టర్లలో వంకాయల మూటలు వచ్చాయి. తూకం వేసి అన్నిటినీ హైదరాబాద్ మార్కెట్ కోసం ఒకలారీలోకి లోడ్ చేస్తున్నారు. నాకు వంకాయ అస్సలు పడదుకాబట్టి మా ఆవిడకు సహజంగా వంకాయంటే చాలా ఇష్టం. విజయవాడనుండి ఏమీ తీసుకురావు అని విసుక్కుంటూ ఉంటుందికదా? ఈ వంకాయలు నాలుగు కేజీలు తీసుకెళ్లి వంకాయ మాసోత్సవమో, సంవత్సరోత్సవమో చేయవచ్చు. ఇబ్బడి ముబ్బడిగా వంకాయలు తెచ్చినందుకు మా ఆవిడ తెగ సంతోషపడుతుంది… అనుకుంటూ… నిగనిగలాడే వంకాయలు నాలుగు కే జీ లు ఒక కవర్లో తూకం వేసి…ఎంతో చెప్పు అన్నా. చేతిలో పెన్ను, కాగితం, క్యాలికులేటరు పెట్టుకుని అందరు రైతులనుండి వంకాయలు కొంటున్న ఆ ఆసామి నిర్మలంగా, నిశ్చలంగా, జ్ఞానిలా, నాకు అత్యంత శ్రేయోభిలాషిలా – ఎందుకండీ? టీ పెట్టించుకున్నారు…తాగి వెళ్లిపోండి. ఈ విషం మీకెందుకు మధ్యలో? అని పాత సినిమాల్లో మంచి విలన్ లా ముసిముసినవ్వులతో చెప్పాడు. కారణం చెప్పాలికదా ? అన్నాను. సేమ్ రైల్వే కోడూరు స్టోరీనే . కథంతా సేమ్ టు సేమ్. ఓన్లీ ఐటెం చేంజ్. అక్కడంటే బావమరిది బతగ్గోరు – అని సామెత. ఇక్కడ మన బతుకు కోరిన దారిన పోయే ఈ ఆసామి దానయ్య కూడా బంధువుకంటే గొప్పవాడే . కోయడానికి కొన్నిరోజులముందు వంకాయ నిగనిగలాడడానికి, పురుగుపట్టకుండా ఉండడానికి మందులు చల్లే కూలీలే ఘాటుకు స్పృహదప్పి పడిపోతారట. అలాంటిది చూస్తూ చూస్తూ మీకమ్మనలేనండి- అన్నాడు. ఇలాంటివారు భూమ్మీద కోటికొక్కరైనా ఉండడం వల్ల వర్షాకాలంలో చినుకులు పడుతున్నాయి; ఎండా కాలంలో ఎండలు కాస్తున్నాయి అనుకుంటూ కారెక్కాను.
ఈ ఆసామి అత్యాశకానీ…మా ఇంటిముందు సూపర్ మార్కెట్ ఫ్రిడ్జ్ ప్లాస్టిక్ కవర్లలో నేను తింటున్నది చలికి గడ్డకట్టిన ఈ వంకాయల్నే కదా? వేసవిలో ఆవురావురుమని ఆరగిస్తున్నది ఆ రైల్వే కోడూరు దోసకాయల్నే కదా! మనమివన్నీ తినకపోతే వేల కోట్ల పెట్టుబడులతో పెట్టిన ఏడు నక్షత్రాల ఆకాశ హర్మ్యాల, అద్దాల భవనాల ఇంద్రలోక ఆసుపత్రులు ఎలా బతుకుతాయి- పాపం! పొలాల్లో ఎక్కువ మందులు – శరీరానికి మరింత ఎక్కువ మందులు. ఆ మందుకు – ఈమందు విరుగుడుకాదు. పరస్పరపోషకం.
జీవవైవిధ్యసదస్సులో చెప్పిన ఒక మాటతో ముగిద్దాం. పుచ్చులున్న కాయల్లోనే మంచివి ఏరుకోవాలట. నిగనిగలాడే పళ్లు కాకుండా నాలుగురోజులు కాగానే మచ్చలు పడే పండ్లు; మెత్తబడే పండ్లు బాగున్నపుడు (మనంకాదు-పండ్లు) తినాలట. లేకపోతే పురుగులుకూడా ముట్టని కాయలు, పళ్లు మనం తింటున్నందుకు – పురుగులుపడకుండానే పోతార్రా! అని పురుగులు కూడా మనల్ని శపిస్తాయట!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
పమిడికాల్వ మధుసూదన్ విశ్లేషణల కోసం ఫాలో అవ్వండి
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు