చెరువుల లీజుకు పాత ధరలనే కొనసాగిస్తామని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సమన్వయ కమిటీ సమావేశంలో ఇచ్చిన హామీ ప్రకారం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర ఐక్య కార్యాచరణ సమితి హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఐక్య కార్యచరణ సమితి ఛైర్మన్ దీటి మల్లయ్య ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సభ్యులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఘనంగా సత్కరించి, ధన్యవాదాలు తెలియజేశారు.
అలాగే తమ అభ్యర్థన మేరకు పంచాయతీ రాజ్ శాఖా పరిధిలోని చెరువుల్లో చేపల పెంపకం, చేపల వేట పై యాజమాన్య హక్కులను మత్స్య శాఖకు బదిలీ చేయడం వల్ల గంగ పుత్రులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె. సి.ఆర్.కు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, మత్స్య కమిషనర్ కు, సంబంధిత అధికారులకు సమన్వయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
సమస్యాత్మక సొసైటీ లలో గొడవలు లేకుండా ఉండాలంటే సమగ్ర ఫిషరీస్ రక్షణ చట్టం మరియు సర్క్యులర్ స్థానంలో ప్రత్యేక జీఓ జారీ చేయాలని డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో కార్యాచరణ కమిటీ ఛైర్మన్ దీటి మల్లయ్యతో బాటు కన్వీనర్ కైరంకొండ యాదగిరి, అధికార ప్రతినిధులు పాక మధుసూదన్, ఎల్లా ముత్తన్న, కార్యవర్గ సభ్యులు కాపర్తి మోహన్ కృష్ణ, మెట్టు ధన్ రాజ్ తదితరులు హాజరయ్యారు.