కేంద్రం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నది. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ వ్యక్తిగత సిబ్బందిలోని 8 మంది అధికారులను 12 స్టాండింగ్ కమిటీలు, 8 శాఖా సంబంధ స్టాండింగ్ కమిటీల్లో నియమించింది. ఈ మేరకు మంగళవారం రాజ్యసభ సెక్రటేరియట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకాలు తక్షణం అమల్లోకి వస్తాయని, తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు వారు కొనసాగుతాయని పేర్కొన్నది. ఈ నిర్ణయాన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ ఉత్తర్వు ఊహించలేనిదని రాజ్యసభ ఎంపీ ఒకరు అన్నారు. దీనిపై కాంగ్రెస్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ మనీశ్ తివారీ మాట్లాడుతూ ‘ఉపరాష్ట్రపతి.. వైస్ చైర్‌పర్సన్, లేదా ప్యానల్ వైస్ చైర్‌పర్సన్‌లా సభకు చెందిన సభ్యుడు ఎంతమాత్రం కాదు. అలాంటప్పుడు ఆయన తన వ్యక్తిగత సిబ్బందిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలలో ఎలా నియమిస్తారు? ఇది వ్యవస్థాగత ద్రోహంతో సమానం కాదా?’ అని ప్రశ్నించారు.
అన్ని రాజ్యసభ కమిటీలకు సరిపడా సిబ్బంది ఉన్నారని, అయినా ఆ కమిటీలు రాజ్యసభకు మాత్రమే చెందినవని, చైర్మన్‌కు సంబంధించినవి కావని రాజ్యసభలోని కాంగ్రెస్ చీఫ్ విప్ జైరాం రమేశ్ అన్నారు. పార్లమెంటరీ కమిటీల్లో ఎంపీలకు మాత్రమే స్థానముందని, వారికి సహకరించడానికి లోక్‌సభ, రాజ్యసభ సచివాలయ సిబ్బందిని మాత్రమే నియమించాలని లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య తెలిపారు. గతంలో ఎన్నడూ ఇలాంటి నియామకాలు జరగలేదన్నారు. ప్రస్తుతం 24 స్టాండింగ్ కమిటీలు ఉండగా, అందులో 21 మంది లోక్‌సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. సాధారణంగా చాలా బిల్లులు సభలో ప్రవేశపెట్టిన తర్వాత పరిశీలన నిమిత్తం వాటిని ఈ కమిటీలకు పంపుతారు. సభ్యుల డిమాండ్ మేరకు స్పీకర్, రాజ్యసభ చైర్మన్ వీటిని కమిటీలకు పంపే అధికారం ఉంటుంది.