Sunday, September 8, 2024
HomeTrending Newsప్రశ్నాపత్రాల లీకుపై కేంద్రం కొరడా

ప్రశ్నాపత్రాల లీకుపై కేంద్రం కొరడా

దేశవ్యాప్తంగా ఇటీవల అన్ని రాష్ట్రాల్లో పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకు జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని ఇంటి దొంగల సాయంతో జరుగుతున్న అక్రమాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణకు దిగింది. పరీక్షల్లో అక్రమాల కట్టడికి ఉద్దేశించిన చట్టాన్ని కేంద్రప్రభుత్వం నోటిఫై చేసింది.

ప్రభుత్వ పరీక్షల (అక్రమాల నిరోధక) చట్టం-2024కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు నెలల కిందటే ఆమోదముద్ర వేయగా, కేంద్రం తాజాగా చట్ట నిబంధనలను నోటిఫై చేసింది. ఈ నెల 21 నుంచే ఈ చట్టం అమల్లోకి రానున్నది. దీని ప్రకారం పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే పదేండ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. జైలు శిక్షతోపాటు కోటి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నది.

నీట్, నెట్‌, యూజీసీ పేపర్‌ లీకుల నేపథ్యంలో ఈ చట్టాన్ని నోటిఫై చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. చట్టాన్ని ఎప్పుడు అమలు చేస్తారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని ప్రశ్నించిన మరుసటి రోజే దీనిపై నోటిఫికేషన్‌ వెలువడటం గమనార్హం. న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తున్నట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) బిల్లు-2024ను లోక్‌సభ ఫిబ్రవరి 6న ఆమోదించగా, 9న రాజ్యసభ ఆమోదించింది. అదే నెల 12న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. యూపీఎస్సీ, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌, రైల్వేస్‌, బ్యాంకింగ్‌ రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామ్స్‌, ఎన్టీఏ నిర్వహించే పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.

నీట్‌, యూజీసీ నెట్‌ పేపర్‌ లీకులపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. త్వరలో నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఉన్నాయి. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల్లో పేపెర్ లీకేజీల ఎన్నికల ప్రచార అస్త్రంగా మారే అవకాశం ఉంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్