Various Variants: జంధ్యాల సినిమాలో బ్రహ్మానందం భుజానికి వేలాడే సంచిలో అలారం, మందు సీసాలతో తిరుగుతూ ఉంటాడు. వేళ దాటకుండా మందులు వేసుకోవాలని డాక్టరు చెప్పిన షరతును పాటించడానికి ఆయన చేసుకున్న ఏర్పాటు అది. రోడ్డు మీద ఎవరోతోనో మాట్లాడుతుండగా అలారం మోగుతుంది. వెంటనే సంచిలో ఒక మందు బాటిల్ తీసి మూతలోకి కొంత వేసుకుని…బాటిల్ మొత్తం తాగి…మూతలో ఉన్నది బాటిల్లో పోసి…మూత బిగించి…సంచిలో వేసుకుని…తాపీగా మాట్లాడుతూ ఉంటాడు. అదేమిటి? మూతలో వేసుకున్నది కదా తాగాలి? బాటిల్ మొత్తం అలా తాగేశారు? పరవాలేదా? అని అడిగితే…వేళకు వేసుకోవడం ప్రధానమండీ…ఎంతయినా…సంచిలో అయినా…కడుపులో అయినా…వెధవ మందు పడి ఉంటుంది…అని తాపీగా చెబుతాడు.
మరో సినిమాలో అలీని కంగారు కంగారుగా వీల్ చెయిర్లో ఆసుపత్రికి తీసుకొస్తారు. రెసెప్షన్లో ధర్మవరపు డాక్టర్. వైద్య పరీక్షలకు ప్రింట్ కొడితే కొండవీటి చేంతాడు అంత లిస్ట్ వస్తుంది. ఇన్ని పరీక్షలు నాకు అవసరమా? అని అలీ అడిగితే…మా ఆసుపత్రికి అవసరం అని డాక్టర్ ధర్మవరపు సమాధానమిస్తాడు.
ఈ రెండు సన్నివేశాలు హాస్యం కోసం సృష్టించినవే అయినా…అందులో హాస్యం మాటున దాగిన నిజం మనకు తెలియనిది కాదు. విషాదానికి హాస్యం పూత పూసి మింగేయడం అలవాటు చేసుకున్నాం. నిజం తెలిసినా అబద్దపు ప్రచారాన్ని నమ్మక తప్పని మాయలో పడిపోయాం. విషయం మరీ జెనరలైజ్ కాకుండా…ప్రస్తుత కోవిడ్ నాలుగో తరంగం – వేవ్ కే పరిమితమవుదాం.
టీకాలు కనుక్కున్నారు కాబట్టి రోగాలు ఉన్నట్లు నమ్మించాలా?
రోగాలు పుట్టాయి కాబట్టి టీకాలను కనుక్కోవాలా?
ఒకటి, రెండో డోసు టీకాలు, మూడో బూస్టర్ డోసు నాలుగో తరంగానికి పనిచేయవు కాబట్టి నాలుగో టీకా వ్యాపారం ముక్కుల దాకా వస్తోందా? టీకా ఏడాదికే కాబట్టి ఏటేటా టీకాలే దిక్కు అన్న వాదనలో టీకా వ్యాపార సూత్రం మాత్రమే ఉందా? ఆరోగ్య పరిరక్షణ కూడా ఉందా?
టీకాల కాక్ టెయిల్ మిశ్రమ హై స్పిరిట్ వైద్య ప్రవచనాలు ఏటేటా డిసెంబరు చలి మంచు వేళల్లోనే మొదలు కావడం కాకతాళీయమా? ఫార్మా, ఆసుపత్రుల వ్యాపార విజయ బహిరంగ రహస్య విధానమా?
చైనాను ఇప్పుడు వణికిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ బి ఎఫ్.7 రెండేళ్లుగా 91 దేశాల్లో ఉండగా…ఇప్పుడదేదో పెను ప్రళయమయినట్లు ఒక్కసారిగా వార్తల అగ్ని పర్వతం బద్దలై…డాక్టర్లు మొదటి పేజీ బ్యానర్ ఐటమ్స్ కావడం దానికదిగా జరిగిందా? ఎవరయినా జరిపిస్తున్నారా?
అయినా…
మనం మనుషులం కాదు.
రోగులం.
టీకాలకు బానిసలం.
మందులకు మార్కెట్లం.
పరీక్షలకు ప్రశ్నలం.
మాస్కు చాటు మొహాలం.
భౌతిక సుదూరులం.
కోవిన్ యాప్ లకు డౌన్లోడులం.
ఇంతకూ…
కోవిడ్ దానికదిగా వస్తోందా?
ఎవరిచేత అయినా రాబడుతోందా?
ఇది-
వచ్చే వైరస్సా?
తెచ్చుకునే వైరస్సా?
వ్యాక్సిన్ చెప్పదు.
వైరస్ వినదు.
మధ్యలో మనకొస్తోంది.
కానివ్వండి…కూర్చోండి…
ఆచమ్యా…
శానిటైజర్ చల్లుకోండి.
కేశవాయస్వాహా…
వేసుకోండి మళ్లీ టీకా చుక్కలు.
నారాయణాయస్వాహా..
బూస్టర్ పంచ పాత్రలో ఉద్దరణి ముంచి మూడు సార్లు చేతిలో వేసుకోండి.
మాధవాయస్వాహా…
తొడుక్కోండి పి పి ఈ కిట్.
గోవిందాయనమః…
కేశవా! కే శవా!
ఎవర్రా అక్కడ?
కే. శవా! అన్నది!
కేశవా ఒకే మాట. విరవకూడదు. విరిస్తే అది శవం పిలుపు!
అవునా స్వామీ!
అలాగేలే…
విరుపు, కలుపు గొడవలు మాకెందుకులే స్వామీ?
కోవిడ్! దా!
కోవిన్! దా!
కోవిందా! గోవిందా!!
అనుకుంటూ ఉండిపోతాం…
ఏ గొడవా లేకుండా…
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]
Also Read :
Also Read :