Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకోట దాటని కోచింగ్

కోట దాటని కోచింగ్

Hit by Covid, Kota Coaching Institutes

ఏటా కోటా కోచింగ్ వ్యాపారం:-
మూడు వేల కోట్ల రూపాయలు

చిన్నా పెద్ద కోచింగ్ సెంటర్లు:- 60
(ఒకరివే అనేక బ్రాంచులు అదనం)

బయటినుండి వచ్చి చదువుకునే విద్యార్థులు:-
ఒకటిన్నర లక్షల మంది

ఒక్కొక్కరి ఫీజు:-
సంవత్సరానికి రెండు లక్షల దాకా

ఊళ్లో హాస్టల్స్:-
3,000

మెస్సులు, క్యాంటీన్లు:-
1,800

పేయింగ్ గెస్ట్ అకామిడేషన్:-
25,000 మందికి

గది అద్దె:-
నెలకు ఒక్కొక్కరికి 15,000/- దాకాKota Coaching Institutes

Kota Coaching Institutes :

రాజస్థాన్ కోట పోటీ పరీక్షలకు పెట్టని కోట. కట్టని కోట. ప్రత్యేకించి ఐ ఐ టీ ప్రవేశ పరీక్షలకు కోట పెట్టింది పేరు. కోట కీర్తి ప్రతిష్ఠలకు సంబంధించినవే పై అంకెలు. పది లక్షల జనాభా దాటని కోట పట్టణంలో లక్షల మంది పిల్లలు బయటినుండి వచ్చి హాస్టళ్లలో ఉంటూ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు.

ఏటా కోటాలో ఈ విద్యా వ్యాపారం మూడు వేల కోట్ల రూపాయలు దాటుతుంది. దేశవ్యాప్తంగా కోటా కోచింగ్ సెంటర్లకు డిమాండ్ పెరగడంతో దేశంలోని మిగతా నగరాల్లో కూడా కోటా విస్తరించిన కొమ్మల బ్రాంచులు వెలిశాయి.

ఐ ఐ టీ ప్రవేశ పరీక్ష రాసేవారిలోనుండి ఎంపిక అయ్యేవారి శాతాన్ని లెక్కకడితే సరిగ్గా ఒక్క శాతం కూడా దాటదు. కానీ మిగతా 99 శాతం మంది ఖర్చు, శ్రమ, ఒత్తిడి, బాధలో తేడా ఏమీ ఉండదు. గెలిచిన ఒకరిని చూస్తూ మనమూ గెలవకపోతామా అని ఆశపడడమే కోచింగ్ సెంటర్లకు పెట్టుబడి.

చదువు ఇప్పుడొక ఇష్టం కాదు-
కష్టం.
చదువు ఇప్పుడొక ఉపాధి కాదు-
వ్యాపారం.
చదువు ఇప్పుడొక విజ్ఞానం కాదు-
విలయం.
చదువు ఇప్పుడొక వికాసం కాదు-
విషాదం.
చదువు ఇప్పుడొక సంస్కారం కాదు-
సంక్షోభం.
చదువు ఇప్పుడొక ఆనందం కాదు-
ఆడలేని ఎత్తుల చదరంగం.

ప్రస్తుత సందర్భం చదువుల్లో లోపాల గురించి కాదు కాబట్టి…అసలు విషయంలోకి వెళదాం. రాజస్థాన్ కోట పట్టణంలో ఇప్పుడు శూన్యం, నైరాశ్యం రాజ్యమేలుతోంది. కోవిడ్ దెబ్బకు కోచింగ్ సెంటర్లు మూత పడ్డాయి. హాస్టళ్లు, మెస్సులు, క్యాంటీన్లు మూత పడ్డాయి. నిత్యం విద్యార్థులతో కిటకిటలాడే రోడ్ల మీద ఎన్నెన్నో చిన్నా చితకా వ్యాపారాలు జరిగేవి. అవన్నీ మూతపడ్డాయి.

ఇప్పట్లో తెరుచుకునే సూచనల్లేవు. తెరుచుకున్నా ఇదివరకటిలా బిలబిలమని కట్టలు తెగినట్లు పిల్లలు వస్తారన్న గ్యారెంటీ లేదు. కొన్ని కోచింగ్ సెంటర్లు శాశ్వతంగా మూత పడ్డాయి. కొన్ని మూతపడే ముందు ఆరిపోయే దీపంలా మిణుకు మిణుకుమంటున్నాయి. కొన్ని కోచింగ్ సెంటర్లు ఆన్ లైన్ క్లాసులు మొదలు పెట్టినా ఆర్థికంగా సరిపోవడం లేదు. ఒక్కసారిగా వ్యవస్థ కుప్ప కూలినట్లుంది కోట కోచింగ్ సెంటర్ల పరిస్థితి. అంతా అగమ్యగోచరంగా ఉంది. ఐ ఐ టీ లకు పిల్లలను పంపగలిగేంత తెలివయిన కోట…తెలివి కోల్పోయి దిక్కులు చూస్తోంది. దశాబ్దాలుగా చదువులతో కళకళలాడిన కోట చదువులు కోట గోడ దాటడం లేదు. చదువుల కోట బీటలువారింది. ఐ ఐ టీ ప్రవేశ పరీక్షలకు పెట్టని కోట…ఇప్పుడు ఎవరికీ పట్టని కోట అయ్యింది.Kota Coaching Institutes

ఈ విషాదం మీద ఎకనమిక్ టైమ్స్ చాలా లోతయిన విశ్లేషణ చేసింది. పేరున్నది కాబట్టి కోట కథ ఇంతలా వచ్చింది. కోవిడ్ కొట్టిన దెబ్బకు దేశంలో ఇలా ఎన్ని కోటలు కూలిపోయాయో? ఎన్ని కోటలు మాట రాక మూగబోయాయో? ఎన్నెన్ని కోటలు ధూళిలో ధూళిగా కలిసి నామరూపాల్లేకుండా పోయాయో?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

పుస్తకాలు లేని చదువులు

 

Also Read:

గోడలు చెప్పే పాఠాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్