సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూశారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆగస్ట్ 19న ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరి చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం 3.05 గంటలకు తుదిశ్వాస విడిచారు. సీతారాం బౌతికకాయాన్ని బోధన, పరిశోధన అవసరాల కోసం ఎయిమ్స్ కు దానం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.
తెలుగు మూలాలు ఉండి తమిళనాడులో స్థిరపడిన కుటుంబంలో జన్మించిన ఏచూరి విద్యార్ధి దశనుంచే వామపక్ష భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. 1974లో ఎస్ఎఫ్ఐ నేతగా సీతారాం ఏచూరి ప్రస్థానం ప్రారంభమైంది.1975లో జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్నప్పుడు సీపీఎంలో చేరారు. జేఎన్‌యూ విద్యార్థి సమాఖ్యకు ఏచూరి మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1984లో సీపీఎం కేంద్ర కమిటీలో చేరారు. 1990లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, 2005లో వెస్ట్ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ సీపీఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2018లో హైదరాబాద్; 2022లో కేరళలోని కన్నూర్ లో జరిగిన మహాసభల్లో ఆయన మరో రెండు సార్లు ఎన్నికై ప్రస్తుతం పదవిలో కొనసాగుతూనే మరణించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన మోహన్ కందాకు సీతారాం మేనల్లుడు.
సీతారాం ఏచూరి మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. లెఫ్ట్ పార్టీలకు ఆయనో దిక్సూచిలా వ్యవహరించారని, రాజకీయాలకు అతీతంగా అందరితో అనుబంధం ఏర్పరచుకున్నారని పేర్కొన్నారు.