గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇళ్లులేని పేదలకు అమరావతిలో ఉచితంగా ఇంటిపట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 33వ సీఆర్డీయే సమావేశం తీర్మానించింది. న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత ఇళ్లస్థలాలు లబ్ధిదారులకు అందించనున్నారు. దీనికోసం 1134.58 ఎకరాల భూమిని కేటాయించారు. మొత్తం 20 లే అవుట్లలో స్థలాలు ఇస్తారు. మొత్తం 48,218 మందికి లబ్ది చేకూరనుంది. అమరావతి పరిధిలోని ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, నిడమానూరు ప్రాంతాల్లోని స్థలాలను దీనికోసం ఎంపిక చేశారు లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్ లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు సిఎం ఆదేశాలు ఇచ్చారు. ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు చట్టంలో మాciర్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం… సీఆర్డీయే చట్టంలో సెక్షన్41(3), (4)ల ప్రకారం R5 జోన్ ను ఏర్పాటు చేసింది.
నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడోవిడత కింద వీరికి ఉచితంగా ఇళ్లపట్టాలు ఇవ్వాలని, ఇళ్ల నిర్మాణానికి కూడా అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని సిఎం ఆదేశించారు. మే నెల మొదటివారం నాటికి.. పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఇళ్లులేని పేదల చిరకాల వాంఛ నెరవేర్చే ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఈ సమీక్షలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్.జవహర్ రెడ్డి, పురపాలక శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్, రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.