Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్అరుదైన మహిళా క్రికెటర్

అరుదైన మహిళా క్రికెటర్

Sensational Player: చాలా ఏళ్ళక్రితం సంగతి… ఈనాడు వసుంధరలో పనిచేసిన రోజులు. పదవతరగతి చదివే మిథాలీ రాజ్ అనే అమ్మాయి మహిళల అంతర్జాతీయ క్రికెట్ టీం కు సెలెక్ట్ అయినట్టు పత్రికల్లో వార్త వచ్చింది. ఆ అమ్మాయితో మాట్లాడి స్టోరీ చెయ్యమన్నారు. స్పోర్ట్స్ డెస్క్ వాళ్ళని అడిగి అడ్రస్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి సాయంత్రం అయింది. సికింద్రాబాద్ ఏరియాలో చిన్న ఇల్లు. మేడపైన పోర్షన్. వెళ్లేసరికి మిథాలీ ఇంకా ప్రాక్టీస్ నుంచి రాలేదు. వాళ్ళ అమ్మ మాట్లాడారు. పిల్లలకోసం చేస్తున్న ఉద్యోగం మానేసారావిడ. మిథాలీ తండ్రి వాయుసేనలో ఉద్యోగం చేస్తూ పిల్లల గురించి గొప్ప కలలు కనేవారు. క్రికెట్ కోచింగ్ కి వెళ్లే అన్నతో పాటు తానూ వెళ్లి ఆటపై మక్కువ పెంచుకున్న మిథాలి త్వరత్వరగా ఆటలో పట్టు సాధించడం, కోచ్ ప్రోత్సాహంతో టోర్నమెంట్స్ కి వెళ్లడం, జిల్లా స్థాయినుంచి చక చకా జాతీయ స్థాయిలో ఆడటం … ఆమె తల్లిదండ్రులు ఈ వివరాలు పంచుకున్నారు. కాసేపటికి ఇంటికి వచ్చిన మిథాలి ఫ్రెష్ అయి మాట్లాడటానికి వచ్చింది. ముఖంలో అమాయకత్వం, క్రికెట్ తప్ప ఇంకేమీ తెలియదంటూనే డాన్స్, సినిమా, ఐస్ క్రీం ఇష్టమని చెప్పింది. అప్పటి ప్రముఖ క్రికెటర్ పూర్ణిమ ప్రోత్సాహం ఉందని మాత్రం చెప్పింది. మర్నాడు ఆమె తండ్రి దురైరాజ్ మిథాలి ఫోటోలు, పేపర్ కట్టింగ్స్ ఉన్న బుక్ తీసుకుని ఆఫీస్ కి వచ్చారు . ఆ స్టోరీ కూడా వసుంధర లో వచ్చింది. అయితే అప్పటి ప్రపంచకప్ లో మిథాలి ఆడలేదు. ఆ తర్వాత 1999 మహిళల ప్రపంచకప్ లో అడుగెట్టిన ఈ హైదరాబాదీ వరుసగా ఆరుసార్లు ప్రపంచ కప్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించింది.

ప్రస్తుతం అంతర్జాతీయ మహిళల ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో ఆరవసారి ప్రపంచకప్ లో ఆడుతూ మిథాలీ రికార్డు సృష్టించింది. ఇదే తన ఆఖరి ప్రపంచ కప్ అన్న మిథాలి ప్రస్తుత జట్టు కెప్టెన్ కూడా. మహిళల క్రికెట్లో సచిన్ టెండూల్కర్ అనిపించుకున్న ఈ మహిళా క్రికెటర్ 20 ఏళ్లలో 600 మ్యాచ్ లు, 20 వేల పరుగులతో అజేయంగా నిలిచింది. నాలుగు పదులకు చేరువైనా క్రికెట్ లో తగ్గేదే లేదంటూ మిథాలీ అర్జున, పద్మశ్రీ, తాజాగా మేజర్ ధ్యానచంద్ ఖేల్ రత్న అవార్డు అందుకుంది. అయితే ఇవేవీ ఆమెకు అలవోకగా రాలేదు. ఎప్పటికప్పడు ఎన్నో పరీక్షలు.. అవమానాలు. అన్నీ తట్టుకుంది కనుకే మళ్ళీ కెప్టెన్సీ వరించింది. విజయంతో ప్రపంచ కప్ సాధించి కెరీర్ ముగించాలని మిథాలీ, ఆమె అభిమానుల ఆకాంక్ష.

— శోభశ్రీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్