Mini Mahanadu: రాష్ట్రంలో రహదారులకు పడిన గుంతలు పూడ్చలేని సిఎం జగన్ మూడు రాజధానులు కడతారా అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. తమ పరిపాలనలో ఎప్పుడైనా రోడ్లకు గుంతలు చూశారా అని ప్రజలను బాబు ప్రశ్నించారు. జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు నేడు మొదటగా అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగిన మినీ మహానాడులో పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడని, కోనసీమ జిల్లాలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడం ఈ ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని బాబు విమర్శించారు. సిఎం సొంత జిల్లా కడపలో కూడా రైతులు పంటలు వేయబోమని ప్రకటిస్తున్నారంటే ఇది కచ్చితంగా సిఎం జగన్ వైఫల్యమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యం చేస్తామని చెప్పారు. గత నెలలో ఒంగోలులో నిర్వహించిన రాష్ట్రస్థాయి మహానాడుకు ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించినా ఆ వేడుకను సక్సెస్ చేసి తమ సత్తా చూపామని, కార్యకర్తల పట్టుదల వల్లే ఇది సాధ్యమైందని బాబు చెప్పారు. చోడవరం మహానాడుతో ఈ ప్రభుత్వ పతనం ప్రారంభమయ్యిందని బాబు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీని ఏదో చేయాలని కలలు గన్నవారి పనే అయిపోయిందని, కానీ టిడిపి శాశ్వతంగా ఉందన్నారు.
పోలీసులను ఉపయోగించుకుని తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని, కానీ నాడు ఎన్టీఆర్ ఇచ్చిన స్ఫూర్తి తో ఉన్న ఈ పార్టీ కార్యకర్తలను ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. అందుకే ఎన్టీఆర్ స్ఫూర్తి – చంద్రన్న భరోసా అనే కార్యక్రమంతోనే ప్రజల ముందుకు వచ్చామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని, నెలకు ఐదువేల రూపాయలు ఇచ్చి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారని, ఇప్పుడు కూలీ పనులు చేస్తేనే నెలకు పదిహేను రూపాయలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : అరాచక పాలన ఎదుర్కొంటాం: బాబు