Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅప్పుడు మేకకొక తోక - ఇప్పుడు తోకకొక మేక

అప్పుడు మేకకొక తోక – ఇప్పుడు తోకకొక మేక

Daakko Daakko Meka…

ఇది జీవశాస్త్రానికి సంబంధించిన మేకల పరిణామక్రమ సిద్ధాంతం కాదు. సాహిత్యంలో అయిదు వందల ఏళ్ల వ్యత్యాసంలో మేక విలువ ఎలా మారిందో తెలుసుకునే ప్రయత్నం.

అయిదు శతాబ్దాల క్రితం దక్షిణాపథంలో విజయనగర రాజ సాహితీ సభా మండపంలో సాహితీ సమరాంగణ సార్వభౌమ, మూరు రాయర గండ కృష్ణదేవరాయల సమక్షంలో ఒక పరదేశ కవిని తికమక పెట్టి ఓడించడానికి వికటకవి తెనాలి రామలింగడు చెప్పినది “మేకకొక తోక” పద్యం.

ఘంటసాల గొంతుతో ఈ మేక గంగిగోవుకంటే గొప్పదై తెలుగువారి చెవులకు కర్ణామృతమయ్యింది. మేక తోక వెనుక మరొక మేక; ఆ మేక తోక వెనుక ఇంకొక మేక…ఇలా సీసపద్యం నాలుగు పాదాల్లో ఒకదాని వెనుక మేకలే ఉన్నాయి. సీసం కింద గీతంలో కూడా మేకలే వరుసగా ఉన్నాయి. ఓరినాయనోయ్…ఇందులో ఏదో తెలియని రహస్యం దాగుందని ఆ పరదేశ కవి అర్థం చెప్పలేనని ఓటమిని అంగీకరించి పలాయనం చిత్తగించాడు. తెనాలి మీసం మెలేశాడు. కృష్ణరాయడు నవ్వుకున్నాడు. ఇంగ్లీషు మెకాలే చదువులు రానంతవరకు పనికిరాని మేకలు కూడా మనదగ్గర ఇలా సాహితీ విలువను పులుముకునేవి.

పద్యం:-

సీ:
మేకతోకకు మేక తోక మేకకు మేక
మేక తోకకు తోక తోక మేక
మేకతోకకు మేక తోక మేకకు మేక
మేక తోకకు తోక తోక మేక
మేకతోకకు మేక తోక మేకకు మేక
మేక తోకకు తోక తోక మేక
మేకతోకకు మేక తోక మేకకు మేక
మేక తోకకు తోక తోక మేక

గీ:
మేక తొకతోక తొకతోక తోకమేక
మేక తొకతోక తొకతోక తోకమేక
మేక తొకతోక తొకతోక తోకమేక
మేక తొకతోక తొకతోక తోకమేక.

పద్యం వినదలుచుకున్నవారికి ఆ సందర్భంతో పాటు వీడియా లింక్:-

కట్ చేస్తే అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం చంద్రబోస్ రాసిన దాక్కో మేక పాట.

పాట:-

“హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక..
వెలుతురు తింటది ఆకు..
ఆకును తింటది మేక..
మేకను తింటది పులి..
ఇది కదరా ఆకలి..

పులినే తింటది చావు..
చావును తింటది కాలం..
కాలాన్ని తింటది ఖాళీ..
ఇది మహా ఆకలి..

వేటాడేది ఒకటి.. పరిగెత్తేది ఇంకొకటి..
దొరికిందా ఇది సస్తాది.. దొరక్కపోతే అది సస్తాది..

ఒక జీవికి ఆకలేసిందా.. ఇంకో జీవికి ఆయువు మూడిందే..
హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక..

చేపకు పురుగు ఎరా..
పిట్టకు నూకలు ఎరా..
కుక్కకు మాంసం ముక్క ఎరా..
మనుషులందరికీ బతుకే ఎరా..

గంగమ్మ తల్లి జాతర..
కోళ్లు పొట్టేళ్ళు కోతరా..
కత్తికి నెత్తుటి పూతర..
దేవతకైనా తప్పదు ఎరా..
ఇది లోకం తలరాతరా..

ఏమరపాటుగా ఉన్నావా.. ఎరకే చిక్కేస్తావు..
ఎరనే మింగే ఆకలుంటేనే ఇక్కడ బతికుంటావు..
కాలే కడుపు సూడదురో నీతి న్యాయం..
బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టారాజ్యం..

అడిగితే పుట్టదు అరువు..
బతిమాలితే బతుకే బరువు..
కొట్టర ఉండదు కరువు..
దేవుడికైనా దెబ్బే గురువు..

తన్నులు సేసే మేలు.. తమ్ముడు కూడా సెయ్యడు..
గుద్దుడు సెప్పే పాఠం.. బుద్ధుడు కూడా సెప్పడహే..”

పాట వినదలుచుకున్నవారికోసం లింక్:-

మేక ఎప్పుడయినా, ఎక్కడయినా మేకే. తెనాలి మేకకు – చంద్రబోస్ మేకకు తేడా ఏమిటో స్క్రిప్ట్ చదివి, గానం విని, చూసి…ఎవరికి వారు తేల్చుకోవచ్చు.
“తన్నులు చేసే మేలు తమ్ముడు కూడా చెయ్యడు, గుద్దుడు చెప్పే పాఠం బుద్ధుడు కూడా చెప్పడు…”
అని ముక్తాయింపులో రచయిత తన్ని, గుద్ది తీర్పు చెప్పాడు కాబట్టి వాదనకు దిగి ఉపయోగం ఉండదు అన్న గ్రహింపు మాత్రం తప్పనిసరి.

నిజమే. అడవిలో అయినా, ఊళ్లో అయినా, సాహిత్యంలో అయినా కవి వ్యాఘ్రాలు కనబడితే పాఠక, ప్రేక్షక మేకలమయిన మనం దాక్కోవడమే తక్షణ కర్తవ్యం. అదే అవశ్యం

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: ఇంగ్లీషులో తెలుగు ఏడుపు

Also Read: పొట్టి తెలుగు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్