Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Real Hero With His Unique Service Motto – Srihari

ఇండస్ట్రీకి వెళ్లి హీరో కావడమనేది థియేటర్ కి వెళ్లి సినిమా చూడటమంత ఈజీ కాదు.  అందుకు ఎంతో కృషి  .. పట్టుదల .. సాధన అవసరం. తెరపై హీరోగా వెలిగిపోవాలని కలలు కనడం తేలికే.  కానీ ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా అటువైపు కన్నెత్తి చూడటం కూడా కష్టమే. అయినా ఆ దిశగా అడుగులు వేయాలంటే కొండంత గుండె ఉండాలి ..  కాశమంతటి ఆత్మవిశ్వాసం కావాలి. ‘ధైర్యం నీలోనే ఉంది .. భయమూ నీలోనే ఉంది .. ఈ రెండింటిలో దేనిని నువ్వు తట్టిలేపితే అదే బయటికి వస్తుంది’ అని నమ్మిన శ్రీహరి, ధైర్యాన్ని అమ్ములపొది నుంచి తీశారు.

ఆర్ధికపరమైన ఇబ్బంది లేకుండా చేసే ఏ పనీ సాహసం క్రిందికి రాదు .. పేదరికానికి దూరంగా చేసేది ప్రయోగమే కాదు అన్నట్టుగానే శ్రీహరి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కృష్ణాజిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన పేద కుటుంబంలో శ్రీహరి జన్మించారు. ఆ తరువాత ఆయనకి ఊహతెలియక ముందే ఆ కుటుంబం బ్రతకడం కోసం హైదరాబాద్ వచ్చేసింది. అప్పటి నుంచి ఒక వైపున మెకానిక్ షెడ్ నడుపుకుంటూ, మరో వైపున పాల బిజినెస్ చేస్తూ ఆ కుటుంబం కాలాన్ని గడపసాగింది.

శ్రీహరికి కాస్త ఊహతెలిసిన తరువాత, తమ మెకానిక్ షెడ్ ఎదురుగా ఉన్న ‘శోభన థియేటర్’కి వెళ్లి సినిమాలు చూడటం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు బ్రూస్లీ సినిమాలు చూడటం వలన జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాలనీ, కండలు పెంచాలనే కోరిక కలిగింది. దాంతో ఆయన ఆ దిశగా గట్టి కసరత్తులే చేస్తూ వెళ్లారు. జాతీయస్థాయిలో జిమ్నాస్టిక్స్ లో పాల్గొన్నారు. ఆ తరువాత ఆయన దృష్టి నటన వైపుకు మళ్లింది. శోభన థియేటర్ దగ్గర హీరోల కటౌట్ లు చూసినప్పుడల్లా, అక్కడ తన కటౌట్ కూడా చూసుకోవాలనే కోరిక బలపడతూ వెళ్లింది.

ఆ దిశగా ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించి, దాసరి నారాయణరావు కంటపడ్డారు. ఆయన ‘బ్రహ్మనాయుడు’ సినిమాలో శ్రీహరికి తొలి అవకాశం ఇచ్చారు. ఆ సినిమా సరిగ్గా ఆడకపోయినా, శ్రీహరి అందరి దృష్టిలోపడ్డారు. ఆ తరువాత ఆయన చేసిన ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ .. ‘హలో బ్రదర్‘ .. ‘తాజ్ మహల్’ సినిమాలు యంగ్ విలన్ గా ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అలా హీరో కావాలనుకుని వచ్చిన ఆయన అడుగులు విలన్ వేషాల వైపు పడ్డాయి. యంగ్ విలన్ … కామెడీ టచ్ ఉన్న విలన్ పాత్రలు వేస్తూ ఆయన ముందుకు వెళ్లారు.

తెలుగు తెరపై సిక్స్ ప్యాక్ తో కనిపించిన తొలి తెలుగు విలన్ శ్రీహరినే అని చెప్పాలి. ఆకర్షణీయమైన పర్సనాలిటీ .. తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్ .. డూప్ లేకుండా చేసే ఫైట్లు శ్రీహరి ప్రత్యేకతలుగా మారిపోయాయి. వీలైతే విలనిజం .. కాకుంటే కామెడీ అన్నట్టుగా ఆయన ఆ రెండింటినీ కలిపి నడిపించారు. అలా ఒక వైపున  పవర్ఫుల్ విలన్ గా మెప్పిస్తూనే, మరో వైపున హీరోగాను తన ముచ్చట తీర్చుకున్నారు. ‘పోలీస్’ సినిమాతో హీరోగా ఆయన తొలి హిట్ ను అందుకున్నారు. ఈ సినిమాకి సంబంధించి తన కటౌట్ ను శోభన థియేటర్ ముందు పెడితే చూసుకుని మురిసిపోయానని ఆయన అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.

హీరోగా శ్రీహరిని ప్రేక్షకులు అంగీకరించారు. అందువలన ఆయన హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. ‘సాంబయ్య’ .. ‘అయోధ్య రామయ్య’ .. ‘భద్రాచలం’ వంటి సినిమాలు హీరోగా ఆయన క్రేజ్ ను మరింతగా పెంచాయి. ఇక ‘ఢీ’ .. ‘ నువ్వొస్తానంటే నేనొద్దంటానా‘ .. ‘మగధీర’ .. ‘మహానంది’ .. ‘బృందావనం’ .. ‘అహ నా పెళ్లంట’ సినిమాల్లో ఆయన పోషించిన కీలకమైన పాత్రలు, సినిమాల విజయంలో కీలకమైనవిగా నిలిచాయి. ‘మగధీర’ సినిమాలో పోషించిన ‘షేర్ ఖాన్’ పాత్ర ఆయన కెరియర్లోనే మైలురాయిగా నిలిచిపోయింది. ఈ పాత్రలో శ్రీహరిని తప్ప మరొకరిని ఊహించుకోలేం.

ఇలా ఒక ఒక కేరక్టర్ ఆర్టిస్ట్ గా .. విలన్ గా .. హీరోగా శ్రీహరి అంచలంచెలుగా ఎదిగారు. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీని అద్భుతంగా ఆవిష్కరిస్తూ, తను పోషించిన ప్రతి పాత్రపై తనదైన ముద్ర వేశారు. నిండైన రూపం .. గంభీరమైన వాయిస్ .. తెలంగాణ యాసతో, కళ్లతోనే అనేకహావభావాలను పలికించేవారు. తెలుగులోని పవర్ఫుల్ ప్రతినాయకులలో ఒకరిగా నిలిచిపోయారు. శ్రీహరి తెరపై విలన్ గా ఎంత కటువుగా కనిపిస్తారో, తెర వెనుక ఆయన అంత సున్నితమైన మనసున్నవారు అనే విషయం కొంతమందికి మాత్రమే తెలుసు.

తనలా వేషాల కోసం వచ్చి ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న ఎంతోమందికి ఆయన సాయం చేశారు. శ్రీహరి కారణంగానే ఈ రోజున తాము ఈ స్థానంలో ఉన్నామని చెప్పుకునే ఆరిస్టులు చాలామందినే ఉన్నారు. సహాయం కోసం ఆయన ఇంటికి వెళ్లిన ఎవరూ ఉత్త చేతులతో తిరిగి వెళ్లలేదని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తాను హీరో కావడానికి ముందు ఎలా ఉండేవారో అలాగే ఉండటం, అప్పటి స్నేహాన్ని చివరి వరకూ అలాగే కొనసాగించడం శ్రీహరి గొప్పతనం. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా ప్రయాణించి విజయాన్ని సాధించడమనే విషయంలో ఆయనను స్ఫూర్తిగా తీసుకోవచ్చు.

తెరపై డూప్ లేకుండా రియల్ గా ఫైట్లు చేయడం వల్లనే శ్రీహరిని ‘రియల్ హీరో’ అంటారని చాలామంది అనుకుంటారు. కానీ తెరపైన హీరోగా పదిమందికి సాయం చేసినట్టుగానే, తెర బయట కూడా ఆయన అనేక మందికి సహాయ సహకారాలను  అందించారు. అందువలన ఆయనను రియల్ హీరో అంటారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. మనసున్న హీరోగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీహరి జయంతి నేడు (ఆగస్ట్ 15). ఈ సందర్భంగా ఒకసారి ఆయనను స్మరించుకుందాం.

(శ్రీహరి జయంతి ప్రత్యేకం)

– పెద్దింటి గోపీకృష్ణ

Also Read : కళాభినేత్రి – నట గాయత్రి

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com