Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Vanisri Made Her Stamp On Telugu Cinema With Powerful Roles : 

తెలుగు తెరపై అందం .. అభినయం కలగలిసిన నాయికలలో వాణిశ్రీ పేరు కనిపిస్తుంది. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుని, ఆ స్థానాన్ని సుదీర్ఘ కాలం పాటు కాపాడుకుంటూ వచ్చిన కథానాయికలలో వాణిశ్రీ పేరు వినిపిస్తుంది. అప్పట్లో సినిమాల్లో కథానాయికగా ఎంపిక కావాలంటే ఎన్నో పరీక్షలను దాటుకుని వెళ్లవలసి ఉండేది. కథానాయికగా నిలదొక్కుకోవాలంటే అంతకంటే ఎక్కువగా కష్టపడవలసి వచ్చేది. అలాంటి అగ్నిపరీక్షలను తన ప్రతిభాపాటవాలతో అవలీలగా దాటేసిన అరుదైన కథానాయిక వాణిశ్రీ. 

వాణిశ్రీ(Vanisri ) 1948లో ‘నెల్లూరు’లో జన్మించారు .. ఆమె అసలు పేరు ‘రత్నకుమారి’ .. సినిమాల్లోకి వెళ్లిన తరువాత ఆమె పేరును ‘వాణిశ్రీ’గా ఎస్వీ రంగారావు మార్చారు. వాణిశ్రీ సంపన్నుల ఇంట పుట్టలేదు .. సమస్యలు తెలియకుండా పెరగలేదు. చాలా చిన్న వయసులోనే ఆమె తండ్రిని కోల్పోయారు. ఆ తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో తల్లితోను .. సోదరితోను కలిసి ఆమె మద్రాసుకి చేరుకున్నారు. అక్కడ పాల వ్యాపారం చేస్తూ వాళ్లు తమ జీవితాన్ని మొదలుపెట్టారు. ఆ సమయంలోనే వాణిశ్రీ భరతనాట్యం నేర్చుకున్నారు.

మొదటి నుంచి కూడా వాణిశ్రీకి నటన పట్ల ఆసక్తి ఉండేది. అందువలన ఆమె నాటక ప్రదర్శనలకు వెళుతూ ఉండేవారు. అలా స్టేజ్ పై ఆమెను చూసినవారు సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. తెలుగులో ఆమె ‘భీష్మ’ సినిమా కోసం కెమెరా ముందుకు వెళ్లారు. అలాగే కన్నడ .. తమిళ సినిమాలకు కూడా పరిచయమయ్యారు. అయితే తమిళ .. కన్నడ సినిమాల్లో ఆమెకి కథానాయికగా అవకాశం లభించినంత తొందరగా తెలుగులో రాలేదు. తమిళంలో శివాజీ గణేశన్ .. కన్నడలో రాజ్ కుమార్ సరసన నాయికగా చేస్తున్నప్పటికీ, తెలుగులోని కమెడియన్స్ కి జోడీగా మాత్రమే ఆమె కనిపించారు.

అలా కొంతకాలం పాటు చిన్నచిన్న పాత్రలు చేస్తూ సహనంతో ఎదురుచూస్తూ వెళ్లిన ఆమెకి, ‘రంగుల రాట్నం‘ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాలో వాణిశ్రీపై చిత్రీకరించిన ‘ఇది మల్లెల వేళయనీ .. ‘ పాట ఆమె కెరియర్లోనే ఆణిముత్యమై నిలిచిందని చెప్పొచ్చు. ఆ తరువాత ‘మరపురాని కథ’ సినిమాతో తొలిసారిగా ఆమెకి కథానాయికగా అవకాశం లభించింది. కృష్ణతో చేసిన ‘మరపురాని కథ’ .. శోభన్ బాబుతో చేసిన ‘బంగారు పంజరం’ సినిమాలు కథానాయికగా ఆమెను నిలబెట్టాయి. ఆ తరువాత ఎన్టీఆర్ తో చేసిన ‘నిండు హృదయాలు’ హిట్ తో ఇక ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.

ఒక వైపున శారద .. కాంచన వంటి కథానాయికల నుంచి గట్టిపోటీ ఉన్నప్పటికీ, వాణిశ్రీ వాళ్ల ధాటిని తట్టుకోగలిగారు.  సావిత్రి తరువాత అంతటి కథానాయికగా అభిమానుల మనసులను గెలుచుకున్నారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు వంటి కథానాయకుల జోడిగా భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. ‘దసరా బుల్లోడు’ .. ‘ప్రేమనగర్’ .. ‘సెక్రటరీ’ .. ‘కృష్ణవేణి’ వంటి సినిమాలు ఆమె కెరియర్లో మైలురాళ్లుగా కనిపిస్తాయి. ‘గంగ మంగ’ .. ‘కథానాయిక మొల్ల’ .. ‘గోరంత దీపం’ వంటి నాయిక ప్రధానమైన సినిమాలు, ఆమె అసమానమైన నటనకు అద్దం పడతాయి.

సహజంగానే వాణిశ్రీ తన మేకప్ కీ .. కాస్ట్యూమ్స్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. అలాంటి ఆమె ‘బాపు’ దర్శకత్వంలో మేకప్ లేకుండా ‘గోరంత దీపం’ సినిమా చేయడం విశేషం. ఆ సినిమా కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కెరియర్ జోరుగా సాగుతున్న సమయంలోనే ఆమె వివాహం చేసుకున్నారు. వివాహమైన తరువాత ఓ తొమ్మిదేళ్ల పాటు ఆమె నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తరువాత ఆమె కొన్ని కారణాల వలన రీ ఎంట్రీ ఇవ్వవలసి వచ్చింది. ‘అత్తకి యముడు అమ్మాయికి మొగుడు’ సినిమాతో ఆమె రీ ఎంట్రీ జరిగింది.

ఈ సినిమాలో ఆమె పవర్ఫుల్ అత్త పాత్రను పోషించారు. అహంభావంతో కూడిన అత్త పాత్రలో ఆమె నటన ఆ సినిమాకి హైలైట్ గా నిలిచిపోయారు. అల్లుడి కొమ్ములు వంచడానికి ప్రయత్నించే అత్త పాత్రలకు ఆమె కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు. ఆ క్రమంలో వచ్చిన సినిమాల జాబితాలో, పెద్దింటి అల్లుడు .. అల్లరి అల్లుడు .. దొంగల్లుడు .. బొబ్బిలిరాజా .. బొంబాయి ప్రియుడు కనిపిస్తాయి. ఈ సినిమాలన్నీ కూడా భారీ విజయాలను అందుకోవడం విశేషం. అలా రీ ఎంట్రీలో కూడా తన హవాను కొనసాగించిన ఘనత వాణిశ్రీకి దక్కుతుంది.

చురుకైన .. చలాకీతనంతో కూడిన పాత్రలతో ఇతర కథానాయికలకు భిన్నమైన ఇమేజ్ ను వాణిశ్రీ సంపాదించుకోగలిగారు. కలవారి అమ్మాయిగా డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరించే పాత్రల్లోను, పల్లెటూరి పొగరును చూపించే పాత్రల్లోను ఆమె తనకి సాటిలేదనిపించుకున్నారు. తనదైన లుక్ తోను మహిళా ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. అప్పట్లో మహిళా ప్రేక్షకుల్లో ఆమెకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వాణిశ్రీ హెయిర్ స్టైల్ ను  చాలామంది అనుసరించేవారు. వాణిశ్రీ చీరలు .. వాణిశ్రీ గాజులు అంటూ అప్పట్లో అమ్మకాలు .. కొనుగోళ్లు అన్ని ఊళ్లలో ఒక ఊపుతో కొనసాగేవంటే, ఆమెకి గల క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ‘కళాభినేత్రి’ పుట్టినరోజు నేడు(ఆగస్ట్ ౩) .. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేద్దాం.

(Vanisri  Birthday Special)

– పెద్దింటి గోపీకృష్ణ

Also Read : తెలుగు సినీ చిత్రగుప్తుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com