వృద్ధాప్య ఫెన్షన్లకు అర్హతను 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ఈ నిర్ణయంతో మరో 6,62,000 కొత్త పించన్లు పెరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పించన్ల సంఖ్య 58 లక్షలకు చేరుకోనున్నది. కుటుంబంలో ఒక్కరికే ఫించను పద్దతిని కొనసాగిస్తూ.. భర్త చనిపోతే భార్యకు భార్య చనిపోతే భర్తకు వెంటనే పెన్షన్ బదిలీ చేయాలని, ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.
దోభీ గాట్లకు, సెలూన్లకు 250 యూనిట్ల ఫ్రీ కరెంటివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారంలోగా సంపూర్ణంగా అమలు చేయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.
దళిత బంధు పై చర్చ:
ఆగస్టు 16 నుండి దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని, రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. అందుకు పూర్తిస్థాయిలో అధికారయంత్రాంగం సిద్దం కావాలని కేబినెట్ ఆదేశించింది.
దళిత బంధు పథకం అమలు, విధి విధానాల రూపకల్పనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ విస్తృతంగా చర్చించింది.
కేబినెట్ సమావేశంలో దళిత బంధు పథకం పూర్వాపరాలను సిఎం కెసిఆర్ విశదీకరించారు…
రాష్ట్రంలోని ఆన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదనీ, ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయనీ ముఖ్యమంత్రి అన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…‘‘ మిషన్ కాకతీయ పథకం అమలుద్వారా చెరువుల కింద సాగు పెరిగింది. భూగర్భ జలాలు పెరిగాయి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యి అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చింది. కరెంటు సరఫరా లో వచ్చిన గుణాత్మక మార్పు వల్ల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ఈరోజు రాష్ట్ర ఆదాయంలో 20 శాతం ఆదాయం వ్యవసాయరంగం నుంచే వస్తున్నది. ఇది తెలంగాణా చరిత్రలో మేలిమి మలుపు’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
గ్రామాల్లో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తున్నదనీ., పల్లె ప్రగతి వల్ల మౌలిక వసతుల కల్పన జరిగి, గ్రామీణ జీవితం ఆహ్లాదంగా మారిందన్నారు. ఇందుకు పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనీయులనీ ముఖ్యమంత్రి అన్నారు.
సమైక్య రాష్ట్రంలో విచ్చిన్నమయిపోయిన వృత్తిపనులవారి జీవితాలను నిలబెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేపట్టిందని సిఎం అన్నారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేసే ప్రణాళికలు అమలు చేస్తూ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వృత్తి పనులు చేసుకునే వారి ఆదాయాలు మెరుగు పడెందుకు తోడ్పడ్డాయన్నారు. గొర్ల పంపిణీ గొల్ల కుర్మలకు లాభం చేకూర్చిందనీ., పశు సంపద పెరిగిందని, ముఖ్యంగా గొర్రెల సంఖ్య ఎక్కువున్న రాష్ట్రం తెలంగాణా అని పార్లమెంటు వేదికగా స్వయంగా కేంద్రం ప్రకటించిందనీ ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఇటీవల గొర్రెల యూనిట్ ధరను కూడా లక్షా ఇరవై ఐదు వేలనుంచి లక్షా డెబ్బై ఐదువేలకు పెంచామని ముఖ్యమంత్రి అన్నారు.
చేపల పెంపకం ప్రోత్సహించడం వల్ల మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని సిఎం తెలిపారు. గీత కార్మికులకు చెట్ల పన్ను బకాయీలు రద్దు చేయటమే కాకుండా చెట్లకు పన్ను వేసే విధానాన్నే రద్దు చేసామని ముఖ్యమంత్రి అన్నారు. నేత, మరమగ్గాల వారి ఆదాయాలు మెరుగు పడ్డాయి. నూలు రంగుల మీద సబ్సిడీతోపాటు బతకమ్మ చీరల ఉత్పత్తి ద్వారా చేతినిండా పని దొరికేలా చేసామని ముఖ్యమంత్రి అన్నారు.
రైతుబీమా అమలవుతున్న విధంగా అంతే పకడ్బందీగా, క్రమబద్ధంగా నేత, గీత కార్మికులకు బీమా సదుపాయం కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నేత, గీత కార్మికులు ఆశావహంగా బీమా సదుపాయం కోసం వేచి వున్నారని, సత్వరమే అమలు విధానం పై స్పష్టత తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు.
అదే దిశగా దళిత బంధు పథకం :
దళిత జాతి పేదరికం రూపుమాపాలని ప్రవేశ పెడుతున్న తెలంగాణా దళితబంధు పథకానికి రాష్ట్ర క్యాబినెట్ ముక్త కంఠంతొ ఆమోద ముద్ర వేసింది. దళిత జాతి కష్టాలు తీర్చడానికి ప్రవేశ పెడుతున్న తెలంగాణా దళితబంధు పథకం అమలుకు సంబంధించి మంత్రివర్గ సభ్యులు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ సందర్భంగా దళితబందు పథకానికి చట్టభద్రత కల్పిస్తూ ఒక ప్రత్యేక చట్టం తీసుకు రావాలని క్యాబినెట్ అభిప్రాయ పడింది. గతం లో ఎస్ సి ప్రగతి నిధి చట్టం తెచ్చి, ఒక వార్షిక బడ్జెట్ లో దళితులకు కేటాయించిన నిధులలో మిగిలిన నిధులను తరువాతి వార్షిక బడ్జెట్ కు బదలాయించే విధానం తీసుకొచ్చామన్నారు. ఆ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందనీ, అదే విధంగా దళిత బందు కూడా దేశానికి దారి చూపే పథకం అవుతుందనీ క్యాబినెట్ అభిప్రాయ పడింది.
రెక్కల కష్టం తప్ప మరే ఆస్తి లేని దీన స్థితిలో దళిత ప్రజలు ఉన్నారని, రాష్ట్రంలో ఇరవై శాతం జనాభా ఉన్న దళితుల చేతుల్లో ఉన్న సాగుభూమి కేవలం పదమూడు లక్షల ఎకరాలేనని దళితుల పేదరికానికి ఇంతకు మించిన గీటురాయి లేదని.. ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో గిరిజనుల కన్నా దయనీయ పరిస్తితుల్లో దళితులూ ఉన్నారని ముఖ్యమ్నంత్రి పేర్కొన్నారు.
దళితుల అభివృద్ధి, అరకొర సహాయాలతో సాధ్యం కాదని, అందుకే దళితబంధు లో ఒక యూనిట్ పెట్టుకోవడానికి పదిలక్షల రూపాయల పెద్దమొత్తం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సిఎం అన్నారు. బ్యాంకులతో అనుసంధానం పెట్టుకోలేదని, తిరిగి చెల్లించే భారం ఉంటే దళితుల ఆదాయం లో ఆర్ధిక స్థితిలో మెరుగుదల రాదనీ ముఖ్యమంత్రి తెలియ జేశారు. లబ్దిదారులు ఒక సమూహంగా ఏర్పడి పెద్ద పెట్టుబడితో పెద్ద యూనిట్ పెట్టుకునే అవకాశాన్ని దళితబందు పథకం ద్వారా కల్పించాలనే ముఖ్యమంత్రి నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉపాధి,వ్యాపార మార్గాన్ని ఎంచుకునే స్వేచ్చ లబ్దిదారులదే అని, ప్రభుత్వం అధికారులు, దళిత బంధు స్వచ్చంద కార్యకర్తలూ ఈ దిశగా మార్గదర్శనం చేస్తారని, అవగాహన కల్పిస్తారని ముఖ్యమంత్రి అన్నారు.
లబ్ది దారుడు ఎంచుకున్న ఉపాధిని అనుసరించి సంబంధిత ప్రభుత్వ శాఖ శిక్షణ అవగాహన కల్పించాలని క్యాబినెట్ అభిప్రాయ పడ్డది. శిక్షణ, పర్యవేక్షణ కోసం గ్రామస్థాయి నుంచీ రాష్ట్ర స్థాయి వరకూ వివిధ శాఖల అధికారులతో, గ్రామంలోని చైతన్యవంతులైన వారి భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటుచేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. అమలులో జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి కీలక పాత్ర పోషిస్తారని ముఖ్యమంతి అన్నారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతిజిల్లాలో ‘‘సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ ప్రైజ్’’ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు.
యూనిట్ పెట్టగానే ప్రభుత్వ బాధ్యత తీరిపోదని యూనిట్ సరిగ్గా నడుస్తుందా లేదా అన్న విషయాన్ని నిరంతరం పర్యవేక్షించడం కూడా ముఖ్యమని క్యాబినెట్ తీర్మానించింది.
దళితబంధు పథకం అమలుకు పటిష్టమైన యంత్రాంగం అవసరం అనీ వివిధ శాఖలలో అదనంగా ఉన్న ఉద్యోగుల సమాచారం సమర్పించాలని ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావును కేబినెట్ ఆదేశించింది. దళిత బంధు ద్వారా ఎవరికైతే లబ్ది చేకూరుస్తారో వారికి అందజేసే ఒక ప్రత్యెక కార్డు నమూనాలను క్యాబినెట్ పరిశీలించింది. ఈ కార్డు ఆన్లైన్ అనుసంధానం చేసి లబ్దిదారుని పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.
దళిత వాడల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని, మిగతా గ్రామంతో సమానంగా అన్ని హంగులూ దళిత వాడలకు ఏర్పడాలని, ఇందుకు నిధుల కొరత లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.