పార్టీ కమిటీల్లో అసలైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని, ప్రధాన కార్యదర్శి- ఉపాధ్యక్ష పదవుల్లో మూడు, ఆరు నెలల క్రితం పార్టీలోకి వచ్చిన వారికి స్థానం కల్పించారని కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రాజనరసింహ ఆరోపించారు. సంగారెడ్డిలో భారత్ జోడో యాత్రను ఘనంగా నిర్వహించి, డబ్బులు ఖర్చు పెట్టుకున్న వారికి పదవులు ఇవ్వలేదని, కోవర్టులకు చోటు కల్పించారని విమర్శించారు. తెలంగాణా కాంగ్రెస్ కు ప్రమాదకరమైన జబ్బు వచ్చిందనిదాని పేరే కోవర్టిజం అంటారని వ్యాఖ్యానించారు. పార్టీలో కొన్ని శక్తులు ప్రభుత్వానికి వంతపాడుతున్నాయని, పెద్ద పదవుల్లో ఉన్నవారు కూడా కోవర్టులుగా పనిచేస్తున్నారనే అనుమానాలు కార్యకర్తల్లో బలపడుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ సిద్దాంతాలు ఏమిటో తెలియని వారికి పదవులు ఎలా ఇస్తారని దామోదర ప్రశ్నించారు. కోవర్టులకు ఉన్న గుర్తింపు కష్టపదేవారికి ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేదని, ఈ సమయంలో పార్టీ బలోపేతానికి అందరం కృషి చేయాలని, పార్టీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత కమిటీ చూస్తుంటే అసలు అందరూ కలిసి ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. పార్టీ ఇప్పుడు దీన స్థితిలో ఉందని, ఈ సమయంలో పాటీ కోసం కష్టపడేవారికి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తే పార్టీ బతుకుతుంది కానీ ఇలా చేస్తే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు.
పార్టీలో ఇప్పటికే చాలా తప్పిదాలు జరిగాయని,లోపం ఎక్కడ జరిగిందనే విషయమై సమీక్షలు చేయలేకపోతున్నారని, ఇకనైనా ఇలాంటి వాటిని సరిదిద్దాల్సిన అవసరం హై కమాండ్ మీదనే ఉందన్నారు. ఈ సమయంలో ఏ చిన్న తప్పు జరిగినా పార్టీ మనుగడే కష్టం అవుతుందని దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. కోవర్టులను గుర్తించి, ఇలాంటి వారిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. సమైఖ్య రాష్ట్రంలోనే ఇంతమంది జనరల్ సెక్రటరీలు, ఉపాధ్యక్షులు లేరని, 119 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో 85 మంది ప్రధాన కార్యదర్శులు అవసరమా అని నిలదీశారు.