దామోదరం సంజీవయ్య థెర్మల్ పవర్ స్టేషన్ ట్రయల్ రన్ స్టేజ్ – 2 నిర్వహించినట్టు కేంద్ర ఇంథన శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. బహుశా ఈ నెల ఆఖరు వారంలో ప్రాజెక్టు నుండి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. లోక్‌సభలో వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ‘దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషను స్టేజ్-2 ట్రయల్ రన్ ఈ ఏడాది అక్టోబరులో 800 మెగా వాట్లకు నిర్వహించాల్సి ఉంది కదా, అసలు ట్రయల్ రన్ పూర్తయిందా లేదా వాటి వివరాలు తెలియజేయమని సంబంధిత శాఖ కేంద్ర మంత్రిని కోరారు. అలాగే ఎప్పట్నుంచి ప్రాజెక్ట్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉందని ఎంపీ భరత్ ప్రశ్నించారు. అలాగే కమీషన్ చేయడంలో జాప్యం కారణంగా ప్రాజెక్టు ఓవర్రన్ ఖర్చుల వివరాలు తెలియజేయవలసిందిగా కోరారు.
దీనిపై కేంద్ర పవర్ మరియు న్యూ అండ్ రెన్యువేబుల్ ఎనర్జీ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఎంపీ భరత్ కు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత ఆగస్టు నెలలో పవర్ స్టేషన్-2 పాక్షిక లోడ్ ట్రయల్ రన్ చేసినట్టు తెలిపారు. యూనిట్ పరీక్ష పురోగతిలో ఉందన్నారు. భద్రతా కవాటాల ఫ్లోటింగ్ బాగానే పనిచేస్తున్నాయని చెప్పారు. గత నెల అంటే నవంబరు 2 నాటికి 643 మెగావాట్ల వరకు లోడ్ చేరుకుందని మంత్రి చెప్పారు. సేఫ్టీ వాల్వ్ లు పూర్తయిన తరువాత ఫ్లోటింగ్ టెస్ట్, యూనిట్ 800 మెగావాట్లు పూర్తయ్యాక స్థిరీకరణ పూర్తి చేయాలని, అది కూడా ఈ నెల 20 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నామని తెలిపారు. ఆ తరువాతే ఈ నెల మూడవ వారంలో తాత్కాలికంగా యూనిట్ ట్రయల్ రన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
ప్రాజెక్టు నుండి విద్యుత్ ఉత్పత్తి ఈ నెల చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ వివరించారు. కమీషన్ చేయడంలో జాప్యం కారణంగా రూ.2,159.28 కోట్లు ఓవర్ రన్ ఖర్చు అవుతోందని ఎంపీ భరత్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. నిర్మాణ సమయంలో వడ్డీ (ఐడీసీ) నవంబరు వరకు రూ.3,155.94 కోట్లు, ఐడీసీ అసలు ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ (2019-జూన్) రూ.996.66 కోట్లు వ్యయమవుతుందని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఎంపీ మార్గాని భరత్ రామ్ కు వివరించారు.