Friday, November 22, 2024
HomeTrending Newsకోటి రతనాల వీణ

కోటి రతనాల వీణ

Poet of the soil: కనీసం ఐదు లేదా పదిహేను పంక్తులతో కనిపించే గజల్ ఆరవ శతాబ్ద కాలం నుంచి… అరబిక్ మూలాలతో పర్షియన్ మీదుగా పయనం సాగించి… చివరకు ఇండియాతో పాటు.. పాశ్చాత్య దేశాలను కూడా ఉర్రూతలూగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మన దేశంలో మాత్రం ఎక్కువగా గజల్స్ పాడే సంస్కృతి ఉర్దూ లేదా, హిందీలో మాత్రమే ఎక్కువ కనిపిస్తుంది.

ఆ క్రమంలో మనకు దివంగత బడే గులాం అలీఖాన్, మెహిదీహాసన్, జగజిత్ సింగ్, బేగం అక్తర్ నుంచి పర్వీన్ సుల్తానా, నేటి నేపథ్య గాయకుడైన హరిహరన్ వరకూ ఎందరో గజల్స్ గాయకులు పాడే శాయరీలను ఆ టింజ్ ఉన్నవాళ్లు ఎంతగా ఆస్వాదిస్తుంటారో చూస్తుంటాం. అరబ్ మూలాలతో మొదలైన గజల్ ప్రస్థానం… చాలాకాలం క్రితమే మనదేశంలో ప్రాంతీయ భాషల్లోకీ ప్రవేశించింది. అయితే తెలుగులో కూడా ఆ సంస్కృతి వేళ్లూనుకోవడానికి ఆద్యులు మాత్రం దాశరథి కృష్ణమాచార్యులే.

తెలంగాణ సమాజం కోసం 19 ఏళ్లకే జైలుబాట పట్టి.. ఇందూరు రఘునాథ కోట జైలుగోడల్లో బందీ అయి… నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా.. తెలంగాణ నా కోటి రతనాల వీణ అంటూ పళ్లు తోముకోవడానికిచ్చిన బొగ్గును అక్షర అగ్నిధారలు చేసి… గోడలపై తన రాతలతో రుద్రవీణలు పలికించిన మహాకవిగా… సినీకవిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆస్థానకవిగా ఆయన సాహితీ సంపదను గురించి చెప్పడానికి చాలామంది ఆ స్థాయి మేధావులు ప్రయత్నిస్తే బాగుంటుంది కాబట్టి… నేటి ఆయన వర్ధంతి నేపథ్యంలో ఆ మహానుభావుణ్ని మరోసారి జ్ఞప్తికి తెచ్చుకునేందుకు.. కేవలం మనం దాశరథి గజల్స్ వరకే ఈరోజు పరిమితమవుదాం.

“వలపునై‌ నీ హృదయసీమల నిలువవలెనని ఉన్నది.. పిలుపునై నీ అదర వీధుల పలుకవలెనని ఉన్నది” అంటూ మొట్టమొదటి తెలుగు గజల్ ను సృష్టించి తెలుగులోకానికి పరిచయం చేసిన వ్యక్తి దాశరథి. 1965లో ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో ఉగాది గజల్ అన్న శీర్షికతో ఆయన రాసిన మొట్టమొదటి గజల్ ప్రచురితమైంది. 1962 నుంచి 1977 వరకూ దాశరథి చెన్నైలో ఉన్న కాలంలోనే తెలుగులో గజల్స్ ప్రక్రియ పురుడుపోసుకుంది. ఆతర్వాత దాశరథి చూపించిన బాటలో తెలుగులో గజల్స్ రాసే సంస్కృతీ, ఆలపించేవారు పుట్టుకొచ్చారు. “కొంత కాల మిటులే యేకాంతమ్మున మేలుకొందు కనురెప్పల కశ్రువులను కావలిగా నిల్పుకొందు” అని సి.నారాయణ రెడ్డి రెండవ తెలుగు గజల్ తో మొదలెట్టి పలు గజల్స్ రాశారు.

 Dasarathi Gazals

అయితే 1965లోనే దాశరథి గజల్స్ రాసినప్పటికీ వాటిని ఓ పద్థతిగా ఆలపించి రికార్డ్ చేయడానికి సుమారు రెండేళ్ల టైం పట్టిందట. 1967 లో దాశరథి‌ రాసిన “నీ కొంటె చూపులోన కురిసింది పూలవాన” అంటూ మొదలయే దాశరథి గజల్ ను ఈమని‌ శంకర శాస్త్రి స్వరకల్పనలో పి.బి. శ్రీనివాస్ పాడారు. దాంతో పీ.బీ. శ్రీనివాస్ తొలి గజల్ ఆలపించిన గాయకుడిగా ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు పలువురు గాయకులు తెలుగులో కూడా గజల్స్ తో ప్రయోగాలు చేస్తూ పాడుతున్న క్రమంలో… తెలుగువారికి తమ స్వభాషలో గజల్ ను పరిచయం చేసిన తొలి తెలుగు గజల్ ఆదికవి దాశరథి.

-రమణ కొంటికర్ల

(నేడు దాశరథి కృష్ణమాచార్య జయంతి)

Also Read :

పచ్చ పాపడ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్