Wednesday, January 22, 2025
HomeTrending Newsత్రిపురలో విద్యార్థుల మరణాలు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక

త్రిపురలో విద్యార్థుల మరణాలు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక

త్రిపురలో ఎయిడ్స్ మహమ్మారి జడలు విప్పటం ఇప్పుడు కొత్త కాదు. పదేళ్ళ కిందటే ఎయిడ్స్ వేగంగా విస్తరిస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రాజకీయ పార్టీలకు అధికారం దక్కించుకోవటం మీద ఉన్న శ్రద్ధ ప్రజాసంక్షేమం మీద లేకపోవటంతో చాప కింద నీరులా వ్యాపిస్తోంది.

2013లో 225 మందికి పాజిటివ్‌గా తేలింది. 2012 నుంచి 14 వరకు మూడేళ్లలో 70 మంది గర్భిణులకు హెచ్‌ఐవి పాజిటివ్‌ ఉందని పరీక్షల్లో తేలింది. 2013లోనే 20 మంది ఈ వ్యాధితో మరణించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2014 జూలైలో 15 మంది గర్భిణులు సహా మొత్తం 143 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీఎస్‌ఏసీఎస్) ప్రకటించింది. ఈ ఏడాది మే నాటికి బాధితుల సంఖ్య 5674గా కాగా పురుషులు 4,570, మహిళలు 1103 మంది ఉన్నారు. ఇందులో 47 మంది మృత్యువాత పడగా వారంతా విద్యార్థులే కావటం ఘోరం. రోజు ఐదు నుంచి ఏడు కేసులు కొత్తగా నమోదవుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 220 స్కూళ్లు, 24 కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్‌ తీసుకుంటున్నారని ప్రాథమిక సమాచారం. సంపన్న వర్గానికి చెందిన విద్యార్థులు డ్రగ్స్ అధికంగా వాడుతున్నా… తల్లిదండ్రులకు తెలిసినా ఏమీ చేయలేని దుస్థితి.

ఒకే సిరంజితో అనేకమంది డ్రగ్స్‌ ఇంజెక్ట్ చేసుకోవడంతో ఎయిడ్స్ వ్యాప్తి చెందుతోందని ఆరోగ్యశాఖ నివేదికతో వెల్లడైంది. ఐఐటి, ఎన్ఐటి తదితర సంస్థల్లో ఉన్నత చదువుల కోసం త్రిపురకు ఇతర రాష్ట్రాల విద్యార్థులు అధికంగా వెళుతున్నారు. హెచ్‌ఐవి/ఎయిడ్స్ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి అందుతున్న నిధులు రాజకీయ జోక్యంతో పక్కదారి పట్టాయని స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.

త్రిపురకు బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి మణిపూర్, మిజోరాం మీదుగా మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతోంది. సరిహద్దు భద్రతా తనిఖీలలో డొల్లతనంపై ఎక్కువగా చర్చిస్తే దేశ ద్రోహం అవుతుంది. అగర్తలాలో డ్రగ్స్ క్రయవిక్రయాలు అదుపు చేయలేని స్థాయిలో… రాజకీయ అండదండలతో సాగుతున్నాయని ఆరోపణలున్నాయి.

ఎయిడ్స్ వ్యాధితో విద్యార్థులు చనిపోవటం భవిష్యత్ భారతావనికి నష్టం చేకూరుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పోలీసుల తనిఖీల్లో మాదక ద్రవ్యాలు వెలుగు చూస్తున్నా… ఇప్పటి వరకు సూత్రదారులను కనుక్కోలేకపోయారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారికి కఠిన శిక్షలు పడిన దాఖలాలు లేవు.

సినిపరిశ్రమలో డ్రగ్స్ వాడకం సాధారణంగా మారిందని వినికిడి. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలతోపాటు కార్పొరేట్ పాఠశాలల్లో మాదక ద్రవ్యాల వాడకం పెరిగింది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల దగ్గర చాక్లెట్ల రూపంలో అమ్మకాలు, మరో స్కూల్లో విద్యార్థులు మోతాదు మించి తీసుకోవటంతో వింత చేష్టలు వెలుగు చూశాయి.

ప్రభుత్వంలో ఎవరున్నా డ్రగ్ మాఫియాను కట్టడి చేస్తామనే ప్రతిజ్ఞలు కార్యాచరణలో కనిపించటం లేదనే విమర్శలున్నాయి. దేశంలో సంపన్న రాష్ట్రంగా ఉన్న పంజాబ్ డ్రగ్ మాఫియా ధాటికి ఆర్థికంగా వెనుకబడింది. ప్రభుత్వాలు మేల్కొనకపోతే ఆ కోవలోకి తెలుగు రాష్ట్రాలు చేరుకోవటానికి ఎంతో సమయం పట్టదని సామాజిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్