ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన జైన్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. జైన్ దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన ధర్మాసనం.. జైన్ సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి అని, అందువల్ల ఆయన బయటకొస్తే ఈ కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని సింగిల్ బెంచ్ ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు బెయిల్ మంజూరుకు నిరాకరించింది.
Satyender Jain: సత్యేందర్ జైన్ కు బెయిల్ నిరాకరణ
మనీలాండరింగ్ కేసులో సత్యేందర్ జైన్‌ను గతేడాది మే నెలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఆ బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దాంతో అతను బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మార్చి 21వ తేదీనే ఇరువవర్గాల వాదనలు పూర్తి కావడంతో.. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. ఈ మేరకు నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ తిరస్కరిస్తూ తీర్పు వెల్లడించింది.