నేపాల్ లో కరోన మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ప్రభుత్వం రోజు వారి కేసుల వివరాలు వెల్లడిస్తున్న దానికి వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం కరోన కేసులు తక్కువగా ఉన్నాయని ప్రకటిస్తున్నా ఆస్పత్రులు మాత్రం బాధితులతో నిండిపోతున్నాయి. ఖాట్మండు శుక్రరాజ్ ఆస్పత్రికి కరోన రోగులు రెండు రోజులుగా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఐ.సి.యు వార్డులలో ఇప్పటికే 50 శాతం మంది చేరారు. వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతుండటం, ప్రజలు కరోన నిబంధనలు పట్టించుకోకపోవటం మహమ్మారి వ్యాప్తికి కారణంగా చెపుతున్నారు. డెల్టా వేరియంట్ తీవ్రత, వ్యాప్తి చూస్తుంటే నేపాల్ లో మూడో దశ ప్రారంభమైందా అని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అనుమానిస్తున్నాయి.
డెల్టా వేరియంట్ డ్రాగన్ దేశం చైనాను వణికిస్తోంది. సోమవారం 55 కొత్త కేసులు నమోదయ్యాయి. 20కి పైగా నగరాలు, పదికిపైగా ప్రావిన్స్‌ల్లో డెల్లా వేరియంట్ ఉనికి బయటపడింది. డెల్టా వేరియంట్ వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తోంది. నాన్‌జింగ్‌లో రష్యా నుంచి వచ్చిన విమానాన్ని శుభ్రం చేసిన 9 మంది ఎయిర్‌పోర్టు కార్మికులకు డెల్టా వేరియంట్ సోకినట్లు నిర్ధారణ కావడం గమనార్హం. బీజింగ్ సహా పెద్ద నగరాల్లో కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచారు.