ఉత్తర భారత దేశంలో ఓ వైపు చలి పెరుగుతుంటే మరోవైపు డెంగ్యూ జ్వరాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, హర్యాన రాష్ట్రాలు డెంగ్యూ గుప్పిట్లో బంధిగా మారాయి. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరి, కాన్పూర్ జిల్లాల్లో డెంగ్యూ వేగంగా వ్యాపిస్తోంది. లఖింపూర్ ఖేరి జిల్లాలో సుమారు పదిమందికి ఒకరోజే డెంగ్యూ లక్షణాలు బయట పడటంతో అధికార యంత్రాంగం హుటాహుటిన ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసింది. అటు కాన్పూర్ జిల్లాలో 13 మందికి డెంగ్యూ సోకింది. గత ఏడాది కూడా కాన్పూర్ లో డెంగ్యూ బారిన పది వందలమంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రక్తంలో ప్లేటేలేట్ కౌంట్ తగ్గిపోయి రోగులు అవస్థలు పడుతున్నారు.
మరోవైపు హర్యానాలో ఈ ఏడాదిలో కేవలం 10 నెలల్లోనే డెంగ్యూ కారణంగా 14 మంది మరణించారు. గతేడాది ఈ సంఖ్య 13 గా ఉన్నది. నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది ఇప్పటివరకు 6,151 మంది నివేదికలు పాజిటివ్‌గా వచ్చాయి. ఇంతగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నా హర్యానా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హర్యానాలో రోజుకు సగటున 100 మంది రోగులు డెంగ్యూ చికిత్సకు వస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ 500 కంటే ఎక్కువ శాంపిల్స్ తీసుకుంటుండగా.. అందులో 100 మందికి పాజిటివ్‌గా ఉన్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా పంచకుల, హిస్సార్ జిల్లాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. పంచకులలో ఇప్పటివరకు 1,787 మంది డెంగ్యూ బారిన పడ్డారు. హిసార్‌లో 1,158 మందిని పాజిటివ్‌గా గుర్తించారు. గురుగ్రామ్‌లో 422, యమునా నగర్‌లో 539, అంబాలాలో 252, రేవారిలో 222 మంది రిపోర్టులు పాజిటివ్‌గా వచ్చాయి. ఇంత జరిగినా హర్యానా ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదు. దాంతో ప్రస్తుతం డెంగ్యూ పరిస్థితి అధ్వానంగా మారింది.