Sunday, November 24, 2024
HomeTrending Newsఘట్‌ కేసర్‌ వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్

ఘట్‌ కేసర్‌ వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్

విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727) కు పెను ప్రమాదం తప్పింది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌ కేసర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌ సమీపంలోకి వచ్చేప్పటికి రైలు నుండి నాలుగు బోగీలు పట్టాల నుంచి పక్కకు జరగడంతో భోగీల్లోని ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదమేమీ లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో కాజీపేట-సికింద్రాబాద్‌ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భువనగిరి, బీబీనగర్, ఘట్ కేసర్ రైల్వేస్టేషన్లలో పలు రైళ్లను అధికారులు ముందస్తుగా నిలిపివేశారు.  దాదాపు 500 మీటర్ల వరకూ రైల్వేట్రాక్ డ్యామేజీ అయినట్లు తెలుస్తోంది.  అనంతరం రైల్వే సిబ్బంది ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేపట్టారు.

రైలు వేగం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని, ఎవ్వరికీ ఎలాంటి ప్రాణహాని, గాయాలు కాలేదని.. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ఎస్‌-1, ఎస్‌-4, జీఎస్‌, ఎస్‌ఎల్‌ఆర్‌ కోచ్‌లు పట్టాలు తప్పినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పట్టాలు తప్పిన బోగీలను వేరు చేశామని.. అదే రైలులో ప్రయాణికులను పంపిస్తున్నట్లు రైల్వే వెల్లడించింది. ఈ ఘటన నేపథ్యంలో 040-27786666 నంబరుతో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన లైన్ కాకుండా మరొక లైన్ మీద నుండి రైళ్ల రాకపోకలు సాగిస్తున్న దక్షిణ మధ్య రైల్వే…ప్రస్తుతం ఎలాంటి ట్రైన్లు ఆలస్యం లేదన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు పట్టాలు తప్పిన రైలు స్టార్ట్ కావడానికి కొంత సమయం పడుతుందని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్