Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనిత్య రసగంగాధర తిలకం

నిత్య రసగంగాధర తిలకం

Telugu Tilakam: ఒకే నదికి ఎన్నో పాయలుంటాయి. ఒకే రంగుకు ఎన్నో ఛాయలుంటాయి. భాషోద్యమం కూడ అటువంటిదే.  తెలుగు కవిత్వం కొత్తదారులు పడుతున్న కాలంలో అనేకమంది కవులు కొత్తకూడలిలో నిలబడి తమకు నచ్చిన బాటలో ప్రయాణం చేశారు. కొందరి బాటలు రియలిజం వైపు, మరి కొందరి బాటలు సర్రియలిజం వైపు, ఇంకొందరి బాటలు మిశ్రమిజం వైపు(క్షమించాలి పింగళి గారికి నమస్కారం) సాగితే ఒక్కని బాట మాత్రం అనుభూత్యమృతం వైపుగా సాగింది. జీవితంలో ఎన్నో అనుభూతులుంటాయి. అవి అన్నీ ఒకేలా ఉండవు. అమృతతుల్యమైనవీ ఉంటాయి. హాలాహలాన్ని పంచినవీ ఉంటాయి. అ నందపు జల్లులు ఉంటాయి.  అగ్నిని జల్లినవీ ఉంటాయి. ఇవన్నీ కావాలంటే ఆ బాట దేవరకొండ బాలగంగాధర తిలక్ ని చదవాలి.

“నా కవిత్వం కాదొక తత్వం
మరికాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం”

ఇదీ తిలక్ అతని కవిత్వం గురించి చెప్పుకున్నది. నిజంగానే తిలక్ ఎప్పుడూ యువకుడే!
తిలక్ తన కలంలో త్యాగశక్తి, ప్రేమరక్తి, శాంతిసూక్తి కలగలిపిన సిరాతో అనుభూతి కవిత్వం వ్రాశాడు.
అందుకే తిలక్ ను చదువుతుంటే అద్దం ముందు నిలబడి చూసుకున్నట్లుటుంది. ఒక్కోసారి నల్లగా నిగనిగలాడే జుట్టు, ఇంకొక్క సారి తెల్లగా ముగ్గు బుట్టలాంటి జుట్టు,మరొక్కసారి గోదారి పాయలల్లే రంగుల జుట్టు కనబడ్డట్టుగా ఉంటుంది అయన కవిత్వం. దేనినైనా సూటిగానే చెబుతాడు

“గతమంతా తోలుబొమ్మలాడిన ఒక తెర
వర్తమానం నీ కన్నుల కప్పిన ఒక పొర”

రెండు వాక్యాలలో జీవితాన్నంతటినీ తేల్చి పారేశాడు. ఇంత సూక్ష్మంగా కవిత్వం చెప్పడం అందరివల్లా సాధ్యం కాదు. తిలక్ వల్లయ్యింది. ఎందుకంటే అతనూ అమృతం తాగినవాడు. అతనికి మరణం లేదు. అతనే చెప్పుకున్నట్టుగా…

“నా అక్షరాలు ప్రజాశక్తుల విహరించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు”

ఇవాళ అందమైన ఆడపిల్లలున్నారు కాని అందమైన వెన్నెల మాత్రం అరుదే. ఆ వెన్నెలను అనుభవించాలంటే పెంట్ హౌస్ కు కాదు వెళ్ళాల్సింది…..తిలక్ కవిత్వం లోకి వెళ్ళాలి. ఒక్కోసారి ఆ వెన్నెల భయంకరంగానూ ఉంటుంది. కొసాకంటా చదివితే వెన్నెలెందుకు భయంకరమైందో తెలుస్తుంది.

అందరికీ కవిత్వంలో ఉదాత్తమైన ఉన్నత శ్రేణి నాయకులు దొరికితే తిలక్ కు మాత్రం
“బల్లపరపు జీవితం కింద కాషన్ గా దాచిన
కోర్కెల సీక్రెట్ బాక్స్ లోంచి తీసి
ఉద్రేకాల్ని, సెక్సుని, శృంగారాన్ని
క్రైమ్ ని, షాక్ ని, లాటరీ కాగితాన్ని
చాటుకుండా చూసుకుని నవ్వుకుని మీసం మెలేసుకుని
మాట్లాడకుండా, జెంటిల్మన్ లా మత్తుగా
పడుకుంది గొంగళీపురుగు”
అనే గొంగళీ పురుగు లాంటి సామాన్యుడు కనబడ్డాడు. మధ్యతరగతి మనుషులు, చాలీచాలని జీతాలు, తీరని కోరికలు సాక్షాత్కరిస్తాయి.

మనం రోజూ చూసే పోస్ట్ మాన్ చేతులవంకే చూస్తాం మనం. తిలక్ మాత్రం…
“ఇన్ని ఇళ్ళు తిరిగినా
నీ గుండె బరువు దింపుకోవడానికి ఒక్క గడపలేదు
ఇన్ని కళ్ళు పిలిచినా
ఒక్క నయనం నీ కోటుదాటి లోపలకు చూడదు
ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడిలాగా వెళ్ళిపోయే నిన్ను చూసినప్పుడు
తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు”
అంటూ కోటుదాటి లోపలికి చూడగలిగాడు, పోస్ట్ మాన్ గుండె చప్పుడు వినగలిగాడు.

Devarakonda Balagangadhara Tilak

మనందరికీ దీపాలు దారి చూపిస్తే తిలక్ కి….
“సమాధి మీద దీపం చావుని వెలిగించి చూపుతుంది
దేవాలయంలోని దీపం దేవుని బందిఖానాను తెలుపుతుంది
ఏడమ్ అండ్ ఈవ్ లు చేసిన పాపం ఇలపై వెలిగించిన తొలిదీపం”
అని తెలిసింది. ఎంతటి చారిత్రక వాస్తవిక దృక్పధమో!

“మజాకి పదవీ వ్యామోహం మద్యపానం వృథా వృథా
గజానికొక గాంధారి కొడుకు గాంధీగారి దేశంలో” అంటూ కుండ బద్దలుకొట్టి పారేశాడు.

అంతే కాదు
“చైనాలో చౌ ఎన్ లై పెద్ద అబద్ధం మడుగు” అని కూడ అప్పట్లోనే చెప్పాడు.

“పల్లెటూరి పిల్లకు సినీతార దివాస్వప్నం
పట్నవాసం షోకిల్లాకు హాలీవుడ్ భూతల స్వర్గం”
అని కూడ అన్నాడు. ఇప్పటికీ మార్పులేని సత్యం.

“ఎన్నికలలో ఎగరేసిన వాగ్దానపు కత్తులకి మొనకన్నా పిడిదగ్గర వాడి ఎక్కువ” అని స్పష్టంగా చెప్పాడు.

Devarakonda Balagangadhara Tilak

వెఱ్ఱివెఱ్ఱి పోకడల గురించి ప్రస్తావిస్తూ
“ఇది పసితనం ప్లస్ వెర్రి తనం యింటూ డికడెన్స్
ఈ కషాయం వికటిస్తుంది
ఈ వ్యవసాయం వెర్రితలలు వేస్తుంది”
అని నిక్కచ్చిగా చెప్పేశాడు. ఇది ఇవాళ్టి పాలకులకు అర్థమయితే ఎంత బాగుణ్ణో కదా!

యుద్ధానికి వ్యతిరేకంగా శాంతి కోసం ఎంత పరితపించాడో……
“సదా ప్రజా హితైషిణి సుభాషిణి గర్వంలేని రాణి
కల్లనీ క్రౌర్యాన్నీ కాలుష్యాన్నీ తిరస్కరిస్తుంది
తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది
చల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి”
అంటూ శాంతి మంత్రాన్ని జపించాడు.

ఆ ‘నిత్య రసగంగాధర తిలకానికి’ జయంతి నివాళులతో.

-చక్రావధానుల రెడ్డప్ప ధవేజి

Also Read :

విఎకె వారి ముచ్చట

RELATED ARTICLES

Most Popular

న్యూస్