ఉండవల్లిలో చంద్రబాబు నివాసాన్ని అటాచ్ చేస్తూ కొత్త నాటకానికి తెరతీశారని మాజీమంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన చూసి వణుకు పుట్టి ఈ జగన్నాటకాన్ని మొదలు పెట్టారన్నారు. చంద్రబాబు నివాసం అక్కడ వున్న విషయం అందరికీ తెలుసనీ, ప్రజా వేదిక కూడా అక్కడ నిర్మించామని గుర్తు చేశారు. ప్రజా వేదికను కూల్చినప్పుడు కరకట్టలో అక్రమ కట్టడాలు కూలుస్తానంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అంటున్నారని ధ్వజమెత్తారు. ఏ ఒక్క రైతూ తాము నష్టపోయామంటూ ఫిర్యాదు ఇవ్వకపోయినా ఈరోజు పొద్దున్న నుంచీ నాటకం చేశారని, ఇది పూర్తిగా బురద జల్లే కార్యక్రమమేనని స్పష్టం చేశారు.
కర్ణాటకలో ఓటమితో అక్కడ వైట్ ఫీల్డ్ ప్యాలెస్ పరిస్థితి డోలాయమానంలో పడిందని, వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు కాబోతున్నారని… ఈ పరిణామాలతోనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం పేపర్ మీదనే ఉన్న రింగ్ రోడ్ పై కల కంటున్నారన్నారు. ఐటీ విప్లవం తీసుకొచ్చి లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన చంద్రబాబు నివాసంపై ఇంత పైశాచిక ఆనందం ఎందుకని ఉమా నిలదీశారు.