Saturday, November 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్దేవులపల్లి వారి జ్ఞాపకం

దేవులపల్లి వారి జ్ఞాపకం

ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు ఎప్పుడూ బాగుంటాయి. ఆసక్తికరంగా ఉంటాయి. అందులోనూ ఇద్దరు ప్రముఖుల మధ్య అయితే వేరేగా చెప్పక్కర్లేదు. అటువంటి ఉత్తరాలు పుస్తకరూపంలో వస్తే పండగే పండగ. కానీ అలా పుస్తకరూపంలో రాని ఉత్తరాలు అప్పుడప్పుడూ కొన్ని కంటపడుతుంటాయి.

ఇటీవల మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి మేనల్లుడు రాజర్షి నుంచి మా ఆనంద్ అన్నయ్యకు ఓ రెండు అపురూప లిఖిత ప్రతులు అందాయి. ఆ రెండింటి కథ మరొక సందర్భంలో చెప్తాను. కానీ వాటిలో ఓ కవరు ఉంది. అందులో మూడు నాలుగు ఉత్తరాలు ఉన్నాయి. వాటిలో ఒకటి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు… మల్లాది మంగతాయారు గారికి ఓ కార్డు మీద కొన్ని మాటలు రాశారు.ఇది నలభై నాలుగేళ్ళ క్రితం నాటి ముక్క. అందులోని విషయాలు….

చి. మంగతాయారు,
1. ” ఆముక్త మాల్యద ” – ఈ ప్రతి నాకు ప్రాణం. నా బాల్యంలో లేటు పిఠాపురం మహారాజా నాకు ఇచ్చినది. జాగ్రత్తగా తిరిగి పంపగోరతాను. మరొకటి మామూలిది ఉంది గాని ఇదిఎక్కువ ఉపయోగిస్తుంది అని పంపుతున్నాను.

2. నా యెడ దయచేసి ఒకసారి రాగలవా మా యింటికి? మాట్లాడాలి.

కృష్ణశాస్త్రి.
4.12.78
తోక: ఒక కాగితం ముక్కయినా చిరగకుండా విరగకుండా జాగ్రత్తగా ఉంచు.
లేదా ఇంకొక కాపీ ఈయమంటే ఇస్తా.

9 జగదాంబాళ్ వీధి,
మద్రాసు – 17.
ఫోన్ 442809.

కృష్ణశాస్త్రిగారి చేతిరాత చూడగానే ఓ విషయం జ్ఞాపకమొచ్చింది.అప్పుడప్పుడూ ఆయన మా ఇంటికి వచ్చేవారు. మా నాన్నగారు యామిజాల పద్మనాభ స్వామిగారు కూడా వారింటికి వెళ్ళేవారు. మా నాన్నగారితోపాటు రెండు మూడు సార్లు నేను కూడా కృష్ణశాస్త్రిగారింటికి వెళ్ళాను. వారు నివాసం ఉన్న జగదాంబాళ్ స్ట్రీట్ పక్కనే నేను చదువుకున్న రామకృష్ణామిషన్ స్కూలు (మెయిన్) తాలూకు గ్రౌండ్ ఉండేది. దీనిని న్యూ గ్రౌండ్ అనేవారు. మా స్కూలుకున్న రెండు మైదానాలలో ఇదొకటి. మరొకటి గ్రిఫిత్ రోడ్డులో అమ్మవారి గుడి పక్కన ఉండేది. దీనిని ఆనుకునే ఉన్న శారదా విద్యాలయంలోనే మా నాన్నగారు భాషా పండితులుగా పని చేశారు.

ఓమారు కృష్ణశాస్త్రిగారు తమ పుస్తకాలను మా నాన్నగారికి సంతకం చేసివ్వడం, అందులో ఓ పుస్తకం మీద “ముసలికోతి” అని సంతకం చేయడం బాగా గుర్తు. ఏదో శస్త్ర చికిత్స వల్ల ఆయనకు మాట పోవడంతో ఎప్పుడూ స్క్రిబ్లింగ్ ప్యాడ్లో రాసిచ్చేవారు. రాసి చూపేవారు. వాటికి మా నాన్నగారు జవాబు చెప్పేవారు.

వివేకానంద స్ట్రీట్లో మేమున్న 17 వ నెంబర్ ఇంటికి వచ్చినప్పుడు ఓసారైతే కారులోంచి కిందకు దిగలేదు. నేనూ మా నాన్నగారు ఆ కారు దగ్గరకు వెళ్ళి నిల్చున్నాం. ఆయన రాయడం, మా నాన్నగారు జవాబు చెప్పడం ఆకుపచ్చని జ్ఞాపకమే.

ఇక మల్లాది మంగతాయారుగారెవరో కాదు, మల్లాది రామకృష్ణ శాస్త్రిగారికి స్వయానా చెల్లెలు. ఆవిడకూడా శారదా విద్యాలయంలో తెలుగు టీచరుగా పని చేసేవారు. ఆవిడ “మమతా” అనే కలం పేరుతో రామకృష్ణప్రభ, మిసపత్రికలో ఎన్నో ఎన్నెన్నో రాశారు. రేడియో నాటికలైతే అనేకం రాశారు.ఆవిడంటే నాకెంతో అభిమానం. అప్పట్లో నాకేదన్నా చెప్పుకోవాలనిపిస్తే ఆవిడతో చెప్పుకునే వాడిని.

కృష్ణశాస్త్రిగారు రాసిన మాటలు నాలుగు ముక్కలే అయినా ఇలా ఎన్ని జ్ఞాపకాలొచ్చాయో నాకు.

ఇందులో పాత్రధారులైన అందరికీ నమస్సులు.

– యామిజాల జగదీశ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్