Mini Review: నిఖిల్  కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో ‘కార్తికేయ’ ఒకటి. సుబ్రమణ్యపురంలోని ఆలయం చుట్టూ అల్లుకున్న రహస్యాన్ని ఛేదించడం ఆ సినిమా కథ. ఆ సినిమా ఘన విజయాన్ని సాధించడంతో, దానికి సీక్వెల్ గా ‘కార్తికేయ 2’ను నిన్న ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. అభిషేక్ అగర్వాల్ –  విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఆదిత్యమీనన్ కనిపిస్తాడు. ‘కార్తికేయ’ను మించి ఈ సినిమా ఉంటుందని ప్రమోషన్స్ లో చందూ .. నిఖిల్ చెబుతూ వచ్చారు.

‘కార్తికేయ 2’ ద్వాపరయుగం – ద్వారకా నగరం చుట్టూ తిరుగుతుంది. శ్రీకృష్ణుడు ద్వాపరయుగం అంతరించబోతున్న సమాయంతో తన మిత్రుడైన ఉద్ధవుడికి ఇప్పుడు ‘గురువాయూర్’లో పూజలందుకుంటున్న మూర్తిని  అందజేసిననట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో కృష్ణుడు .. ఉద్ధవుడికి తన కాలు కడియం  ఇచ్చేసి .. మానవాళి శ్రేయస్సుకి ఉపయోగపడే రహస్య సమాచారం అందులో నిక్షిప్తమై ఉందని చెబుతాడు. ఆ కంకణం దుర్మార్గుల చేతికి చిక్కకుండా చేయడమే మన కథానాయకుడి పని.

చందూ మొండేటి తీసుకున్న పాయింట్ చాలా ఆసక్తికరమైనదే. కానీ ఆ పాయింట్ చుట్టూ ఉత్కంఠను  రేకెత్తించే సన్నివేశాలను అల్లుకోలేకపోయాడు. శ్రీకృష్ణుడు తిరుగాడిన ప్రదేశాల్లోనే కథ తిరుగుతూ ఉంటుంది. కానీ నిఖిల్ మానవ ప్రయత్నానికి దైవత్వం సహకరించినట్టుగా చూపించకపోవడమే ఈ కథలోని లోపం. హీరో ఆశయం .. విలన్ ఉద్దేశం కంకణాన్ని దక్కించుకోవడమే అయినా, దానితో వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారు? ఎలా చేయాలనుకుంటున్నారు? అనే విషయంలో మాత్రం సగటు ప్రేక్షకుడికి అర్థం కాదు.

ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు చేశారు .. అద్భుతమైన విజువల్స్ కట్టిపడేస్తాయి. కాలభైరవ పాటలు చెప్పుకోదగినట్టుగా లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. శ్రీకృష్ణుడికి సంబంధించిన యానిమేషన్ వర్క్ …  కొండ గుహలకు సంబంధించిన ఆర్ట్ వర్క్ ఆకట్టుకుంటుంది. కథాకథనాల పరంగా  .. లవ్ ట్రాక్ పరంగా .. కథలోని చిక్కుముళ్లను హీరో విప్పుకుంటూ వెళ్లే పద్ధతి విషయంలో ‘కార్తికేయ’నే బాగున్నట్టుగా అనిపిస్తుంది. అంతకంటే గ్రాండ్ గా తీసినప్పటికీ, కథలో క్లారిటీ లోపించడం వలన ‘కార్తికేయ 2’ కేవలం హడావిడిగా మాత్రమే అనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *